Corona virus : నిర్లక్ష్యం వద్దు..మాస్క్ లు శానిటైజర్లు వదలవద్దు!

దక్షిణాది లో ఎన్ 440కె అనే కొత్తరకం కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Update: 2021-02-20 06:55 GMT

కరోనా వైరస్ (ప్రతీకాత్మక చిత్రం)

Corona Virus: మీరు మాస్కులు, శానిటైజర్లు పక్కన పెట్టేసి ఉంటే వాటిని మళ్లీ వాడటం మొదలుపెట్టడం మేలు. ఏంటి అంతా కరోనా ఫ్రీ అయ్యాక ఇలా చెప్తున్నారేంటి అనుకుంటున్నారా... అవునండి నిజమే ఎందుకంటే ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. యాక్టివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ రెండూ ప్రమాదకర సంకేతాలను సూచిస్తున్నాయి. దక్షిణాది లో ఎన్ 440కె అనే కొత్తరకం కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

వ్యాప్తిలో ఉన్న కొత్త వైరస్ ప్రమాదకరమో కాదో స్పష్టత లేకున్నా, వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. దేశంలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది దాటింది. ఈ క్రమంలో వైరస్‌ జన్యుక్రమ విశ్లేషణ ద్వారా వ్యాప్తిలో ఉన్న రకాలపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సీసీఎంబీ సహా వేర్వేరు సంస్థలు చేపట్టిన కొవిడ్‌ వైరస్‌ 6400 జన్యుక్రమ విశ్లేషణలో 5వేల ఉత్పరివర్తనాలు గుర్తించారు. ప్రధానంగా కొన్ని రకాలే ఎక్కువ వ్యాప్తిలో ఉన్నట్లు తేల్చారు. ఏ3ఐ జూన్‌ 2020 వరకు వ్యాప్తిలో ఉండగా.. తర్వాత ఏ2ఏ విస్తరించింది. ఇందులోని డీ614జీ ఉత్పరివర్తనంతో ఎక్కువ విస్తరణకు కారణమైంది. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ఎక్కువగా కన్పించింది. ఇటీవల చాలా దేశాల్లో కొత్తరకం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో ఉత్పరివర్తనాలతో కొత్త రకం వ్యాప్తిలోకి వచ్చింది. మానవ శరీర కణాలకు అతుక్కుపోయే గుణంతో అధిక ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నట్లు తేలింది.

యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్న కొత్త వైరస్‌ మన దేశంలోనూ వ్యాప్తిలో ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుని వ్యాప్తికి కారణమవుతున్న ఈ484కె, అధిక వ్యాప్తికి కారణమవుతున్న ఎన్‌501వై ఉత్పరివర్తనాలు వీటిలో ఉన్నాయి. భారత్‌లో వీటి ఉనికి ప్రస్తుతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పాజిటివ్‌ల నుంచి సేకరించిన వైరస్‌ నమూనాలను తక్కువగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తుండటం ఇందుకు కారణం కావొచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా అన్నారు. సాధ్యమైనంత ఎక్కువగా జన్యుక్రమాలను కనుక్కొంటే కొత్త రకం వైరస్‌ పుట్టుక, వ్యాప్తి గురించి కచ్చిత సమాచారం తెలుస్తుందన్నారు. తద్వారా రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటున్న, రోగ లక్షణాలను బట్టి, ఎక్కువ విస్తరణకు కారణమవుతున్న కొత్త రకాలను సకాలంలో గుర్తించి నివారించడానికి వీలవుతుందన్నారు.

తాజాగా దేశంలో కొత్త కేసులు 13,993 వచ్చాయి. ఫలితంగా మొత్తం కేసులు 1.09 కోట్లు దాటాయి. నిన్న 101 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,56,212కి చేరింది. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉంది. నిన్న రికవరీ కేసులు 10,307 మాత్రమే వచ్చాయి. మొత్తం రికవరీల సంఖ్య 1.06 కోట్లు దాటింది. రికవరీ రేటు దేశంలో 97.3 శాతం ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,43,127 ఉన్నాయి. మొన్నటికీ, నిన్నటికీ యాక్టివ్ కేసులు ఏకంగా 3,585 పెరిగిపోయాయి. నిన్న దేశంలో 7,86,618 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 21 కోట్లు దాటింది. దేశంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 1,07,15,204కి చేరింది.

ప్రస్తుతం 12 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో నిన్న 3,909 యాక్టివ్ కేసులు పెరిగాయి. పంజాబ్‌లో 161, కర్ణాటకలో 90, మధ్యప్రదేశ్‌లో 45, ఛత్తీస్‌గఢ్‌లో 34 త్రిపురలో 26 యాక్టివ్ కేసులు పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో మళ్లీ పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడి కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్, కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 

Tags:    

Similar News