Corona Effect: కళ్యాణానికి కరోనా భయం..నిలిచిపోయిన లక్షల పెళ్లిళ్లు
Corona Effect: మే నెల నుంచి ముహూర్తాలు ఉన్నాయి. అయితే కరోనా కారణంగా పెళ్లిళ్లు నిలిచిపోయే అవకాశం ఉంది.
Corona Effect: మూడు ముళ్లు, ఏడు అడుగులు, భారీ సెట్టింగ్‌లతో మండపాలు, వందలాది మంది అతిథులు, కళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగ్‌లు, రకరకాల పిండివంటలు, బారాత్‌లు.. ఇది ఒక్కప్పుడు పెళ్లి వేడుక అంటే. కానీ.. ఇప్పుడు కరోనా మహాత్యమా అంటూ వధూవరులు, వారి తల్లిదండ్రులు, బాగా కావాల్సినవారు, వీరితో పాటు మాస్కులు, శానిటైజర్లు ఉంటే చాలు. ఇంటి ఆవరణలోనో, చిన్న వేదికనో చూసుకుని పెళ్లి చేసేసుకునే రోజులు వచ్చాయి.
పెళ్లి వేడుకలపై కరోనా ప్రభావం భారీగా పడింది. దాదాపు మూడు నెలల మూఢం తర్వాత మే 1 మంచి రెండు నెలలపాటు ముహూర్తాలు రాబోతున్నాయి. గతేడాదిలో కూడా ఇదే సమయంలో కరోనా విజృంభించడంతో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఇక.. ఆ సంవ్సతరమంతా కరోనాతోనే సరిపోయింది. అయితే ఈ ఏడాది మొదట్లో కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలా మంది పెళ్లిళ్లు కుదుర్చుకున్నారు. మే, జూన్ నెలల్లో పెళ్లిళ్ల కోసం ఇప్పటికే నిశ్చితార్థాలు పూర్తి చేసుకున్నారు. కల్యాణమండపాలు, భాజాభజంత్రీలు, క్యాటరింగ్ ఇతరత్రా పెళ్లి పనులకు కూడా జోరుగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో కరోనా సెకండ్‌వేవ్ పడగ విప్పింది.
కరోనా విజృంభణతో ముందుగా నిర్ణయించిన పెళ్లిళ్లు జరగడం అనుమానంగానే మారింది. ఇప్పటికే పలు పట్టణాలు, ప్రాంతాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో అసలు పెళ్లిళ్లకు అనుమతి ఉంటుందా.. ఉండదా అనే అయోమయంలో వధూవరులు, వారి తల్లిదండ్రులు పడ్డారు. ఒకవేళ అనుమతి ఇచ్చినా అతికొద్దిమందితో జరుపుకోవాలా..? లేక పెళ్లిని వాయిదా వేసుకొని.. కరోనా కొంత తగ్గుముఖం పట్టాక చేసుకోవాలా..? అని ఎటూ ఆలోచించుకోలేకపోతున్నారు కొందరు. మరికొందరైతే ముహూర్తం మార్చకూడదని, పెళ్లి వాయిదా వేయకూడదని భావించి.. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా జరిపించేస్తున్నారు.
ఏప్రిల్ నెలాఖరు, మే నెలలోని 1, 3, 7, 12, 13, 14 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2 లక్షల నుంచి రెండున్నర లక్షల వివాహ వేడుకలు జరగాల్సిఉంది. అయితే.. కరోనా ఉధృతి నేపథ్యంలో అన్నీ వాయిదా పడ్డాయి. ఇక, కొత్తగా లగ్గాలు పెట్టించుకోవాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందేనని పురోహితులు చెబుతున్నారు. అక్టోబరు నుంచి డిసెంబరు నెలాఖరు ముహూర్తాలున్నాయని, అప్పుడు పెళ్లిళ్లు చేసుకోవాలని చాలా మంది వేచిచూస్తున్నారు.
మరోవైపు.. కోవిడ్ కారణంగా దాదాపు ఏడాది పైనుంచి సరిగా పెళ్లిళ్లు జరగడం లేదు. దీంతో వివాహా ఆధారిత వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కల్యాణమండపాలు, లైటింగ్ డెకరేషన్, పూల డెకరేషన్, కేటరింగ్ వంటి బిజినెస్‌లలో నష్టాలు వాటిల్లాయి. వీటి నిర్వాహకులు, అందులో పనిచేస్తున్నవారు అవస్థలు పడుతున్నారు. అలానే పురోహితులు, సన్నాయి, మేళం, బ్యాండ్ నిర్వాహకులకు కూడా ఉపాధి కరువైంది. దీంతో వీరంతా రోడ్డున పడే పరిస్థితులు దాపరిస్తున్నాయి.