Corona Vaccine: దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్
Corona Vaccine: * భోగిలోపే అందుబాటులోకి రానున్న కరోనా టీకా * తొలి దశలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ * 50 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధుగ్రస్తులకు వ్యాక్సినేషన్
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. కరోనాతో విసిగిపోయిన జనాలకు భోగి పండుగ తర్వాత మంచి రోజులు రానున్నాయి. 13వ తేదీలోపే వ్యాక్సిన్‌ను అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. దీంతో దేశ ప్రజలంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. కరోనా భూతం నుంచి ఇక బయటపడినట్లే అని సంతోష పడుతున్నారు.
కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ నెల 3న అనుమతి ఇచ్చింది. ఇక నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంది. తొలి దశలో వైద్యులకు, వైద్య సిబ్బందికి, కరోనా వారియర్స్‌కి ప్రభుత్వమే టీకా వేయించనుంది. ఇప్పటికే వారి పేర్లు కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నాయి. అలాగే 50 ఏళ్లు దాటి, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు తొలిదశలోనే టీకా వేయించుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించింది. అలాంటి వారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
టీకా వేయించుకున్నవారికి డిజిటల్ ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. అలాగే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు నంబర్‌ను కొవిన్ కేటాయించేలా ఏర్పాటు చేశారు. కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ ఆథెంటికేషన్ ఉంది. టీకా వేయించుకున్నాక ప్రతికూల ప్రభావాలు కనపడితే దాని ద్వారా ట్రాక్ చేస్తారు.
వ్యాక్సిన్ ఆర్మీ రెడీ అయింది. ఈ జనవరిలోనే వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుండడంతో దాదాపు లక్ష మంది వాలంటీర్లు తమ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాలు తమ వాలంటీర్ల లిస్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. సూమారు 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో వ్యాక్సినేషన్ కోసం వాలంటీర్లను రెడీ చేయడం మాములు విషయం కాదు.
కొవిన్ సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచంలో ఏ దేశమైనా ఉపయోగించుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఏదైనా దేశం కోరితే ఆ దేశానికి భారత ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్ టీకా కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైన భారతదేశంపై ప్రపంచ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో భారతదేశ నాయకత్వాన్ని చూస్తుంటే గొప్పగా అనిపిస్తుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కొనియాడారు.