Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు
Corona Third Wave: * నిర్లక్ష్యంగా ఉంటే ముప్పు తప్పదంటున్న నిపుణులు * ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్న ప్రభుత్వం
Corona Third Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి మనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మళ్లీ అంతటా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి తరుణంలో థర్డ్ వేవ్ పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళనను కలిగిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండకుంటే మూడో దశ కరోనా వ్యాప్తి చాలా భయంకరంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకున్నామన్న ధైర్యంతో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరించడం లేదు. ఇలానే ఉంటే మూడో దశ వ్యాప్తి ఖాయమని.. అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని చాలా మంది జాగ్రత్తలు పాటించడం లేదు. నిర్లక్ష్యంగా ఉంటే తీవ్ర ముప్పు తప్పదు. మాస్క్‌లు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా... విచ్చల విడిగా తిరగడం, వేడుకల్లో పాల్గొనడం మంచిది కాదంటున్నారు నిపుణులు. కరోనా ప్రభావంతో ఏడాదిన్నరగా ఇళ్లకే పరిమితమై జనం ఇప్పుడు సాధారణ జీవనాన్ని గడిపేందుకు ఆతురతగా ఉన్నారు. కానీ బయటకు వెళ్లేటప్పుడు కఠిన నిబంధనలను పాటించాలి. తద్వారా థర్డ్ వేవ్ ముప్పును నివారించగలం.
కరోనా థర్డ్ వేవ్ వస్తే పిల్లలపై అధిక ప్రభావం చూపిస్తుందనటానికి సైంటిఫిక్ ఆధారాలు లేవని వైద్యులు చెప్తున్నారు. అయినప్పటికీ నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరిస్తున్నారు. మూడో వేవ్ వస్తే ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యులు చెప్తున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కన్నా ఇప్పుడు పరిస్థితులు మారాయని థర్డ్ వేవ్ వస్తే అందుకు తగ్గట్టు వైద్య పరికరాలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేస్తే కరోనా ప్రభావం తగ్గుతుందని చెప్తున్నారు.