కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు.. రెండు రోజులు పూర్తిగా లాక్‌డౌన్
* కరోనా కట్టడికి భారీ ఎత్తున పరీక్షలు * వీకెండ్‌లో పూర్తిగా లాక్‌డౌన్ * శని, ఆదివారాల్లో లాక్‌డౌన్ అమలు
Kerala: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఇక కేరళలో సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినా మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అప్రమత్తమయిన ప్రభుత్వం వీకెండ్‌లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయానికి వచ్చింది.
ఈనెల 24, 25 తేదిల్లో శని, ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించనున్నారు. మరోవైపు టెస్ట్‌ల సంఖ్య కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. బక్రీద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు ఆంక్షలను ఎత్తేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే శుక్రవారం నాడు భారీగా టెస్టులను చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత రెండు రోజులు పూర్తిగా లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడి చేయాలని భావిస్తున్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే ఎంట్రీ ఉంటుదని వైద్యాధికారులు తెలిపారు.
కేరళలో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజుకు రెండు మూడు కేసులు బయటపడుతున్నాయి. ఇవాళ కొత్తగా మూడు కేసులు నమోదవగా కేరళలో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 41కి చేరినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం ఐదు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు.