కేరళపై విరుచుకుపడుతున్న కోవిడ్.. 22 వేలకు పైగా రోజువారీ కేసులు
* దేశంలోని యాక్టివ్ కేసుల్లో 32 శాతం కేరళలోనే * థర్డ్‌వేవ్‌కు దారి తీసే అవకాశం ఉందని నిపుణుల ఆందోళన
Corona Cases in Kerala: భారత్‌లో తొలి కరోనా కేసు నమోదైన కేరళ మళ్లీ భయపెడుతోంది. ప్రస్తుతం అక్కడి కోవిడ్ కేసులు కేరళను థర్డ్‌వేవ్‌కు కేంద్రంగా నిలిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం మరోసారి వీకెండ్ లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళదే అధిక శాతం. దేశం మొత్తం మీద 4 లక్షలకు పైగా యాక్టివ్ కేసులుండగా అందులో 37% కేసులు కేరళకు చెందినవే. రాష్ట్రంలో రోజురోజుకూ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ ఎస్.కె.సింగ్ నేతృత్వంలోని ఈ బృందం ఇవాళ కేరళలో పర్యటించనుంది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనుంది.
కరోనా సెకండ్ వేవ్ ఆరంభమైన కొత్తలో కేరళ కోవిడ్ నిర్వహణలో మంచి పనితీరే చూపింది. కానీ క్రమంగా పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. తాజాగా ఐసీఎంఆర్ చేసిన నేషనల్ సీరోసర్వేలో దేశంలో అత్యల్ప యాంటీబాడీలున్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. రాష్ట్ర జనాభాలో 56 శాతం మందికి కోవిడ్ ముప్పుందని వెల్లడించింది. సమీప రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. జులై 27న దేశవ్యాప్తంగా 43 వేల కేసులొస్తే అందులో ఒక్క కేరళ నుంచే 22వేల పైచిలుకు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33.3 లక్షలకు చేరింది. దేశం మొత్తంలో ఆర్ రేట్ విలువ 0.95 ఉండగా ఒక్క కేరళలో ఒకటికి పైగా ఉంది. దీంతో పాటు దేశంలో కరోనా అత్యధిక వ్యా్ప్తి చెందుతున్న 30 జిల్లాల్లో పది జిల్లాలు కేరళలోనే ఉన్నాయి.