Corona Effect: చదువులు 'కరోనా'పాలు
*దేశవ్యాప్తంగా 26.45 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం *తెలంగాణలో టీవీలు, ఫోన్ల ద్వారా పాఠాలు విన్నవారు: 17,27,892
Corona Effect: పాఠశాల విద్యపై కరోనా తీవ్ర ఎఫెక్ట్ చూపింది. దేశవ్యాప్తంగా 26.45 కోట్లమంది విద్యార్థులు, 96.87 లక్షల మంది టీచర్లు, 15.07 లక్షల స్కూల్స్ దీన్ని ప్రభావానికి లోనైనట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు 66 లక్షల, 65వేల, 475 మంది ఉండగా 3 నుంచి 10 తరగతుల విద్యార్థుల్లో 17లక్షల, 27వేల, 892 మంది టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా పాఠాలు నేర్చుకున్నట్లు వెల్లడించింది.
ఇందులో అత్యధికంగా డీడీ, టీశాట్ (నిపుణ, విద్యాఛానళ్లు) ద్వారా 11,34,900 మంది; స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ల ద్వారా 2,22,680 మంది తరగతులు విన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 1,17,570 మంది విద్యార్థుల వద్ద ఎలాంటి డిజిటల్ పరికరాలు లేవని సర్వేలో గుర్తించినట్లు తెలిపింది. కేంద్ర విద్యాశాఖ 'ఇనిషియేటివ్స్ బై స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ 2020-21 ఫర్ కంటిన్యూయింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
59 వేల వాట్సప్ గ్రూపులతో పర్యవేక్షణ
తెలంగాణలో టీవీలు, ఫోన్లు లేని విద్యార్థుల కోసం గ్రామపంచాయతీల వద్ద డిజిటల్ పాఠాలను అందుబాటులో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. టీచర్లు, స్వచ్ఛంద సేవకులు ఇళ్లకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు పేర్కొంది. పిల్లల చదువులను పర్యవేక్షించి, మదింపు చేయడానికి రాష్ట్రంలో 59 వేల వాట్సప్ గ్రూప్‌లను పాఠశాలలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (ఎస్‌ఐఈటీ) తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూల్లో రూపొందించిన పాఠాలను ఏకకాలంలో డీడీ యాదగిరి, టీశాట్ ద్వారా ప్రసారం చేసినట్లు పేర్కొంది.
* 1-10 తరగతులు విద్యార్థులు: 81,36,933
* డిజిటల్ పరికరాలు లేనివారు: 2,01,568
* పరికరాలు ఉన్నా చాలామందికి సరైన నెట్‌వర్క్ సౌకర్యం అందుబాటులో లేదు.
* ఎక్కువమంది ఇళ్లలో టీవీలు ఉన్నా అవి చదువులకు ఉపయోగపడటంలేదు.
* విద్యార్థులకు 21,120 డిజిటల్ పరికరాలను (2,850 ల్యాప్‌టాప్‌లు, 18,270 ట్యాబ్‌లు) పంపిణీ చేశారు.
కొవిడ్ అనంతరం అమల్లోకి వచ్చిన కొత్త పద్ధతులు పిల్లల చదువులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివల్ల చాలామంది పిల్లల్లో నేర్చుకోవడం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీన్నుంచి బయటపడాలంటే పాఠశాలలు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాముల సామర్థ్యాలను బలోపేతం చేయాలి. మొత్తంగా బోధన, చదువుల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.