Corona: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా డేంజర్ బెల్స్
Corona: భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకేరోజు 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.
Corona: భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకేరోజు 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఒక్క మహారాష్ట్రలోనే 27 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో దేశంలో సెకండ్ వేవ్ భయం పట్టుకుంది. తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గత 24 గంటల్లో దేశంలో 43 వేల 846 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గత 111 రోజుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి 15 లక్షల 99 వేల 130కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా 197 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య ఒక లక్షా 59 వేల 558కు చేరుకుంది.
ఇటీవల దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రత్యేకించి 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోందని తెలిపింది. వాటిలోనూ మహారాష్ట్ర, కేరళ పంజాబ్ రాష్ట్రాల్లోనే 76.22 శాతం యాక్టివ్ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. మహారాష్ట్రలోని పుణే, నాగ్‌పూర్, ముంబై, థానే, నాసిక్ జిల్లాల్లో కోవిడ్ ప్రబలం ఎక్కువగా ఉండగా, కేరళలోని ఎర్నాకులం, పథానంతిట్ట, కన్నూర్, పాలక్కడ్, త్రిస్సూర్ జిల్లాల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది.
మరోవైపు నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకితే తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఓం బిర్లాకు చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో ఓం బిర్లా పాల్గొన్నారు. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి కరోనా సోకడంతో ఎంపీల్లో ఆందోళన నెలకొంది.