Corona Cases in India: చిగురుటాకులా వణుకుతున్న యావత్‌ దేశం

Corona Cases in India: దేశ వ్యాప్తంగా 2,17,353 కొత్త కేసులు

Update: 2021-04-16 11:54 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona Cases in India: భయం వీడడం లేదు. ఇంకా వణికిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ గడగడలాడిస్తోంది. మహారాష్ట్రలో మొదలైన సెకండ్‌ వేవ్‌ దేశమంతా కమ్ముకుంటోంది. నిన్నమొన్నటివరకూ నిత్యం జనంతో నిండివున్న నగరాలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. మహా నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకూ ఏదో తెలియని భయంతో నిశబ్దం అలముకుంటోంది. బెంగళూరు లాంటి ప్రాంతాల్లో విధులనిండ విషాదం ఊరుతుంది.

తోక ముడిచినట్లే కనిపించిన కరోనా మళ్లీ కొమ్ము విసురుతోంది. వెనక్కి తగ్గినట్లే తగ్గి మెరుపు వేగంతో విరుచుకుపడుతోంది. మహారాష్ట్రలో మొదలైన సెకండ్‌ వేవ్‌ దేశమంతా కమ్ముకుంటోంది.. పంజాబ్‌లో పడగ విప్పింది.. ఛత్తీస్‌గఢ్‌ను వణికిస్తోంది. కర్ణాటకను కుదిపేసేలా ఉంది. తమిళనాడును బెంబేలెత్తిస్తోంది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రతాపం చూపుతోంది.

దేశవ్యాప్తంగా కొవిడ్​ఉద్ధృతి మరింత ప్రమాదకరంగా మారుతోంది. కొత్తగా 2 లక్షల 17 వేల 353 కేసులు వెలుగుచూశాయి. మరో 1,185 మంది మహమ్మారికి బలయ్యారు. రోజువారీ మొత్తం కేసుల్లో సగం.. కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీలో రికార్థు స్థాయిలో లక్షకు పైగా కేసులు బయటపడుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే మహారాష్ట్రలో 61,695, ఉత్తరప్రదేశ్‌లో 22,339, ఢిల్లీలో 16,699 కేసులు నమోదయ్యాయి.

రోజువారీ కేసుల్లో 80శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, రాజస్థాన్‌, పంజాబ్‌, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌బెంగాల్‌లో రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

వైరస్‌ దెబ్బతో బెంగళూరులో విషాదం ఊరుతుంది. బెంగళూరులో కోవిడ్‌ సోకి నిత్యం 50 మంది వరకూ మరణిస్తున్నారు. శ్మశానాల వద్ద మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇక ఢిల్లీలో కరోనా కేసులుతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం వీకెండ్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఢిల్లీలో ఈ నెల 16న రాత్రి 10 గంటల నుంచి 19న ఉదయం 6 గంటల వరకు వీకెండ్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మొత్తంగా వైరస్‌తో అన్ని రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. స్వీయ నియంత్రణతోనే వైరస్‌ కట్టడి సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News