Corona Cases in India: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ
Corona Cases in India: థర్డ్‌వేవ్ కట్టడికి కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ అరోడా సూచనలు
Corona Cases in India: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులే లక్షన్నర దాటుతున్నాయి. అయితే చాలా రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణం కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపత్యంలో థర్డ్ వేవ్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే మూడు అంశాలు ఎంతో ముఖ్యమని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్‌కే.అరోడా తెలిపారు. మరోవైపు దేశంలో ఈ నెలలోనే గరిష్ఠానికి చేరుతుందని ఐఐటీ కార్పూర్ నిపుణులు అంచనా వేశారు. అయితే నిపుణుల అంచనాలు వాస్తవ రూపానికి దగ్గరగా ఉన్నాయని చెప్పారు.
ఒమిక్రాన్ ఉధృతి, కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధలు పాటించడం, టీకాలు తీసుకోవడం అనేవి రెండు ముఖ్యమైన అంశాలు, వీటికి తోడు కర్ఫ్యూ వంటి చర్యలు కూడా వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తాయని నేషనల్ టెక్నికల్ ఆడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్‌కి చెందిన కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ అరోడా స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో కొవిడ్ కేసులు పెరుగుతాయని ఐఐటీ కాన్పుర్ మోడల్ అంచనాలను ఎన్.కే అరోడా సమర్థించారు. వాస్తవ పరిస్థితులు అలాగే ఉన్నాయని.. పలు నగరాల్లో జనవరిలోనే థర్డ్‌వేవ్ గరిష్ఠానికి చేరుకునేలా కనిపిస్తోందని అంచనా వేశారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో జనవరి మధ్యలోనే గరిష్ఠానికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ పేర్కొన్న విషయం వాస్తవమన్నారు. అయితే ఏ స్థాయిలో కేసులు పెరుగుతాయో తర్వాత అదే స్థాయిలో తగ్గుముఖం పడతాయని.. మార్చి మూడో వారంలో ఈ మూడో ఉద్ధృతి ముగుస్తుందని మనీంద్ర అగర్వాల్ ఇప్పటికే వెల్లడించారు.