Corona: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి దృష్టి లోపం
Corona: గత 15 రోజుల్లో సూరత్ నగరంలో కనీసం 40 బ్లాక్ ఫంగస్ కేసులను కనుగొన్నట్టు డాక్టర్లు తెలిపారు.
Corona: దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కనిపించని శత్రువు ఎటునుంచి దాడి చేస్తుందో తెలియక సతమతమవుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. కొంత మంది కరోనా బారిన పడి మరణిస్తుండగా మరి కొంత మంది కరోనాను జయిస్తున్నారు. మరి కొంత మంది కరోనా నుండి బయటపడినా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని సూరత్ లో ఈ వైరస్ నుంచి బయటపడిన 40 కేసుల్లో 8 కేసులు బ్లాక్ ఫంగస్ అనే నూతన రుగ్మతను కనుగొన్నారు. ఈ ఫంగస్ నే మ్యుకోర్మైసిసిస్ అని కూడా వ్యవహరిస్తున్నారు. హఠాత్తుగా కంటిచూపు కోల్పోవడంతో వీరిని హాస్పటల్స్ కి తరలించారు.
గత 15 రోజుల్లో సూరత్ నగరంలో కనీసం 40 బ్లాక్ ఫంగస్ కేసులను కనుగొన్నట్టు డాక్టర్లు తెలిపారు. కోవిడ్ కారణంగా ఏర్పడిన ఇన్ఫెక్షన్ కి చికిత్స ఉంటుందని, కానీ చికిత్సలో జాప్యం జరిగినా, చికిత్స చేయించుకోకున్నా కంటి చూపు పోయినట్టేనని వారు తెలిపారు. కొన్ని కేసుల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయని వారు చెప్పారు. బ్లాక్ ఫంగస్ అంటే అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అట.. మ్యుకోర్ మైసిసిస్ అనే ఫంగస్ నుంచి ఇది వ్యాపిస్తుంది. ఫంగల్ లక్షణాలతో కూడిన గాలిని పీల్చిన పక్షంలో ఇది ముక్కులోని నాళాలను లేదా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
చర్మానికి ఏదైనా గాయం తగిలినా, శరీరం కాలినా ఈ ఫంగస్ ప్రభావం కనబడుతుంది. కోవిడ్ నుంచి కోలుకుని రెండు మూడు రోజులైన తరువాత ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడుతాయి. ఇది మెల్లగా నాలుగైదు రోజుల్లో కంటిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో లేదా మధుమేహంతో బాధపడుతున్నవారిలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఇక ఢిల్లీలోకూడా ఈ విధమైన కేసులను డాక్టర్లు కనుగొన్నారు. గత 2 రోజుల్లో తాము ఆరు కేసులను కనుగొన్నామని, రోగులను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నామని వారు చెప్పారు. బ్లాక్ ఫంగస్ గురించి ఇంకా స్టడీ జరుగుతోందని, ఈ రోగులకు త్వరితగతిన చికిత్స జరిగిన పక్షంలో వీరు కోలుకోగలుగుతారని వైద్య నిపుణులు తెలిపారు.