Karnataka: కన్నడనాట కంట్రాక్టర్‌ ఆత్మహత్య కలకలం

Karnataka: మంత్రి ఈశ్వరప్ప వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య

Update: 2022-04-13 11:55 GMT

Karnataka: కన్నడనాట కంట్రాక్టర్‌ ఆత్మహత్య కలకలం

Karnataka: బెళగావికి చెందిన కాంట్రాక్టర్‌ కె. సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య కర్ణాటకలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన అనుచరులు బసవరాజ్‌, రమేశ్‌ పేర్లను పోలీసులు చేర్చారు. ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సంతోష్‌ ఆత్మహత్యపై సగ్ర విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. అయితే తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంత్రి ఈశ్వరప్ప స్పష్టం చేశారు.

బెళగావికి చెందిన సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ మంత్రి వేధింపులు భరించలేక సుసైడ్‌ నోట్‌ రాసి ఉడిపిలోని ఓ హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన కన్నడనాట తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా సంతోష్‌ పాటిల్‌ సోదరుడు ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి ఈశ్వరప్ప, ఆయన అనుచరులు బసవరాజ్‌, రమేశ్‌ పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కాంట్రాక్టర్‌ ఆత్మహత్యకు కారణమైన ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆమేరకు కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో కమిషన్‌ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయని వాటి ఫలితమే కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ మృతి చెందారని సిద్ధ రామయ్య ఆరోపించారు.

కాంగ్రెస్‌ డిమాండ్‌పై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఈశ్వరప్ప చెప్పారు. సంతోష్‌ పాటిల్‌ తనపై చేసిన ఆరోపణలకు గతంలోనే పరువు నష్టం కేసు కూడా వేసినట్టు చెప్పారు. ఈ విషయంలో కోర్టు తీర్పు రాలేదని ఈ మొత్తం వ్యవహారంలో తన ప్రమేయం లేదని మంత్రి స్పష్టం చేశారు. సంతోష్‌ ఆరోపణలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కర్ణాటకలోని ఆర్‌డీపీఆర్‌కు లేఖ రాసిందని అందుకు అనుగుణంగా జవాబు ఇచ్చిన్నట్టు ఈశ్వరప్ప చెబుతున్నారు. సంతోష్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం మీడియా ద్వారా తనకు తెలిసిందని, అంతకుమించి తనకు ఏమీ తెలియదని తేల్చిచెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. ఈశ్వరప్ప రాజీనామాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పూర్తి వివరాలు తెలిసిన తరువాత దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ తన గ్రామంలో నాలుగు కోట్లతో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేశారు. బిల్లులు చెల్లించడానికి 40శాతం కమిషన్‌ను మంత్రి ఈశ్వరప్ప డిమాండ్‌ చేసినట్టు సంతో‌ష్‌ ఆరోపించారు. అంతేకాదు.. మంత్రికి లంచం కింద 15 లక్షల రూపాయలను వెచ్చించినట్టు ఆరోపణలు చేస్తూ.. ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. 11న కాంట్రాక్టర్‌ సంతోష్‌ విహార యాత్రకు వెళ్తున్నానని భార్యకు చెప్పి.. బెళగావి నుంచి వెళ్లిపోయాడు. మంత్రి ఈశ్వరప్ప వేధింపులు భరించలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు మీడియాకు సంతోష్‌ మెస్సేజులు పంపి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. చివరి లొకేషన్‌ ఆధారంగా పోలీసులు ఉడిపిలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే సంతోష్‌ మృతి చెందినట్టు గుర్తించారు. సుసోడ్‌ నోట్‌లో తన చావుకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప, సహచరులే కారణమంటూ ఆరోపించాడు. తన మరణానంతరం భార్య, పిల్లలకు సాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, బీజేపీ సీనియర్‌ నేత యడ్యూరప్పలను సుసైడ్‌ నోట్‌లో కోరారు.

మంత్రి వేధింపులతోనే సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంత్రి, అతడి అనుచరుల బెదిరించారని.. సంతోష్‌పై పరువు నష్టం కేసు కూడా పెట్టారని సోదరుడు ప్రశాంత్‌ ఆరోపించారు. విహార యాత్రకు వెళ్తానని చెప్పి ఉడిపిలో శవమై కనిపించారని కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి ఈశ్వరప్పపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ప్రశాంత్‌ డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో మంత్రి ఈశ్వరప్ప వార్తల్లో నిలుస్తున్నారు. శివమొగ్గలో బజరంగ్‌దల్‌ కార్యకర్త హత్య తరువాత ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు, క్రైస్తవులు ఏదో ఒక రోజు ఆర్‌ఎస్‌ఎస్‌లో కలుస్తారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంతోష్‌ ఆత్మహత్య వివాదం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర వివాదంగా మారింది. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయాలని మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు కేసు నిర్దారణ అయితే మంత్రి పదవి ఊడే అవకాశం ఉందని రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. 

Tags:    

Similar News