మణిపూర్‌లో రాజకీయ సంక్షోభం.. బీజేపీ ప్రభుత్వం పడిపోతుందా?
మణిపూర్‌రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇప్పటిదాకా బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఇప్పుడు దూరం జరిగారు.
మణిపూర్‌రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇప్పటిదాకా బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఇప్పుడు దూరం జరిగారు. మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర బీజేపీ సర్కారుకు మద్దతును ఉపసంహరించుకున్నారు. ఇందులో ఉపముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులూ కూడా ఉన్నారు. దీంతో బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్ణయించింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు గురువారం గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిశారు, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఓక్రామ్ ఇబోబి సింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ వద్ద అవసరమైన సంఖ్య ఉందని కాంగ్రెస్ పేర్కొంది.
మణిపూర్‌లో 2017 మార్చిలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలోని 60 స్థానాల్లో 21 స్థానాలను పార్టీ గెలుచుకోగా, కాంగ్రెస్ 28 స్థానాలను గెలుచుకుంది. అయితే బీజేపీకి ఎన్‌పిపి, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, అలాగే టిఎంసి, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) నుంచి ఒక్కో సభ్యుడు, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సభ్యుడు శ్యాంకుమార్ మాదిరిగానే, ఆ తరువాత మరో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అయితే శ్యాంకుమార్ సింగ్‌పై అనర్హత వేటు పడటంతో అధికారంలోని బీజేపీ బలం 23కి పడిపోయింది. కాంగ్రెస్‌కు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీనుంచి వైదొలిగిన 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు పలికితే రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని అడ్డుకునేందుకు బీజేపీ కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది.