కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్
*రేసులో ముందున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
AICC President Election: AICC అధ్యక్ష పదవికి పోటీ అంతకంతకూ పెరుగుతోంది. కొత్త అధ్యకుడి ఎన్నిక కోసం ఇవాళ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ ఎవరన్నదానిపై ఊహాగానాలు హీటెక్కాయి. అధినేత పదవికి ఎవరు పోటీపడినా సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నవారే విజయబావుటా ఎగురవేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా ప్రతిపాదించిన పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ దాదాపుగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ రాజస్థాన్ సీఎంగా కూడా కొనసాగాలన్న గెహ్లాట్ ప్రతిపాదనలకు రాహుల్ గాంధీ చెక్ పెట్టారు.
కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసిన గెహ్లాట్ తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. అప్పడు ఏ విషయం చెప్పని రాహుల్ గాంధీ ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక వ్యక్తి ఒకే పదవి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు ఇటీవల ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లోనూ ఇదే తీర్మానాన్ని ఆమోదించామని రాహుల్ గుర్తు చేశారు. ఆ తీర్మానాన్ని నాయకులందరూ శిరసా వహించాల్సిందేనని రాహుల్ స్పష్టం చేశారు. ఈ షరతు అశోక్ గెహ్లాట్‌కు కూడా వర్తిస్తుందన్న విషయం చెప్పకనే చెప్పారు రాహుల్. దీంతో రాజస్థాన్ సీఎం పదవిలో ఉంటూనే AICC అధ్యక్ష పగ్గాలు కూడా చేపట్టాలనుకున్న గెహ్లాట్ ఆశలకు బ్రేకులు పడ్డట్టయ్యింది.