Puducherry: సంక్షోభంలో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కొన్ని రోజుల కిందట ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. పైగా.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటనకు సిద్ధం చేసుకోగా ఒక్క రోజు ముందే ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఇక ఇదిలా ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్రం పదవి నుంచి తొలగించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు. మరొకరిని నియమించే వరకు ఆ బాధ్యతలు తమిళిసై నిర్వర్తిస్తారు. సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఏప్రిల్ - మేలో పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చించేందుకు.. రాహుల్ గాంధీ పుదుచ్చేరికి రానున్నారు. ఈ లోపే ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. దీంతో అక్కడ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పార్టీ బలం మెజారిటీ మార్కు దిగువకు చేరింది.
నమశివాయం, తీప్పయింజన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు జనవరి 25న రాజీనామా చేశారు. వారిద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సోమవారం రాజీనామా చేశారు. మంగళవారం జాన్ కుమార్ రాజీనామా చేశారు. 3 నామినేటెడ్ స్థానాలు మినహా పుదుచ్చేరి అసెంబ్లీకి 30 స్థానాలు ఉన్నాయి. 2016లో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిచింది. డీఎంకే చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతుతో నారాయణ స్వామి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 11కి చేరింది.
యానం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లాడి కృష్ణారావు.. నారాయణ స్వామి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత నెలలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా యానాం శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లాడి కృష్ణారావు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంకు 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. ప్రజల మనిషిగా పేరు పొందారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపులతో అప్రమత్తమైన సీఎం నారాయణ స్వామి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి చర్చించినట్లు సమాచారం. ఇక తాజా పరిణామలతో భాగస్వామ్య పార్టీలతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నారాయణ స్వామి ఒక నిర్ణయానికి రాగానే అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.