Congress Crisis Updates: అసలు కాంగ్రెస్ పార్టీ సమస్య ఏమిటి?
Congress Crisis: రోజురోజుకూ ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పట్టాలెక్కేనా.. అసలు కాంగ్రెస్ పార్టీ సమస్య ఏమిటి?
(హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం)
దేశంలో అతి పురాతన పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలం రోజురోజుకీ పడిపోతోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వందలోపే సీట్లు వచ్చాయి.
2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం కూడా ఏర్పడింది. పార్టీని నడిపించేది ఎవరు అన్న ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తరువాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేశారు.
"అధ్యక్షుడిగా ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నాను. అందువల్లే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను '' అని రాహుల్ అప్పట్లో ప్రకటించారు.
"నెల రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగాలి. నేను ఇప్పుడు బాధ్యతల్లో లేను. రాజీనామా చేశాను. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలి'' అని ఆయన అన్నారు.
2019లో సోనియా గాంధీని ఒక ఏడాది కాలానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడు ఎవరు అన్నది తేలకపోవడంతో ఆమె మరో సంవత్సరం ఆ పదవిలో కొనసాగారు.
అయితే, అధ్యక్ష పదవిపై ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలు గళం విప్పుతున్నారు. కొత్త అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
"పార్టీ అనాథ అనిపించుకునే పరిస్థితి రాకుండా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను తక్షణం ప్రారంభించాలి'' అని ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు.
"పార్టీని నడిపించే శక్తియుక్తులు రాహుల్ గాంధీకి ఉన్నాయి, ఆయన ముందుకు రాకపోతే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలి'' అని థరూర్ వ్యాఖ్యానించారు.
శశిథరూర్ ప్రకటనతో, గాంధీ కుటుంబం కాకుండా బయటి వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.
అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అనేసరికి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది అసలు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక అనగానే గాంధీ కుటుంబంవైపే చూడాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది?
రెండో ప్రశ్న, కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు మళ్లీ గాంధీ కుటుంబంపై ఆధారపడటం వల్ల ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సాధించగలదా?
గాంధీ కుటుంబం బలమా లేక బలహీనతా ?
కాంగ్రెస్ సమస్య ఏమిటి?
కాంగ్రెస్ నిజమైన సంక్షోభం నాయకత్వమే. ఆ పార్టీ దేశ రాజకీయాలలో పూర్తిగా దిగజారి పోయింది. అసలు భారత రాజకీయాల్లో దీనికి ఇంకా స్థానం ఉందా అన్న అనుమానం కూడా తలెత్తుతుంది.
"ఈ రోజు కాంగ్రెస్‌కు తన వైఖరేంటో తనకే తెలియదు. ప్రత్యామ్నాయ విధానంగానీ, నాయకత్వం కానీ లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా దెబ్బతిని ఉంది. యువత నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉంది.
సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడారు. కాంగ్రెస్ మళ్లీ ఎదుగుతుందని ఎవరూ భావించడం లేదు. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
గాంధీ కుటుంబం నుంచి ఎవరూ నాయకత్వ బాధ్యత తీసుకోరు అని గత సంవత్సరం రాహుల్ గాంధీ అన్నారు. కొన్నాళ్లు ఇతరులకు వదిలేయడం మంచిది'' అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే,
"గాంధీ కుటుంబం మినహా, కాంగ్రెస్‌లోని ఇతర సీనియర్లు ఆశను వదులుకున్నారు. వారికి కొంచెం అధికారం ఇస్తే పార్టీని బాగు చేయగలరు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలో పార్టీ మంచి విజయాలను సాధించింది.
గుజరాత్‌లో దాదాపు సమాన పోటీ ఉంది. దిల్లీలో కూడా బీజేపీ ఓడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ లేదా ప్రతిపక్షాలు బీజేపీతో పోటీ పడలేవు అనడం కరెక్టు కాదు. కాకపోతే వాటిని నడిపించే వారు లేరు "
"ఆర్థిక, విదేశాంగ, రక్షణ విధానాల్లో అన్ని విషయాలపై కాంగ్రెస్‌కు అవగాహన, సుదీర్ఘ అనుభవం ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీకి ఇంత సుదీర్ఘ అనుభవం లేదు. మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలు"