పూర్తిగా మారిపోతున్న హుజూరాబాద్ రూపురేఖలు.. వరుసగా నిధులు, పథకాలు, పదవులు
Huzurabad: హుజూరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి.
Huzurabad: హుజూరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. వరుసగా నిధులు, పథకాలు, పదవులతో రాష్ట్రంలోని ఏ నియోజకవవర్గానికి అందనంతగా వరాలజల్లు ఒక్క హుజూరాబాద్‌కే సొంతం అవుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ అటు వైపే దృష్టి సారించారు. ప్రచారాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు.
హుజూరాబాద్ అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ కేక్ గా మారింది. ఒకే నియోజకవర్గంలో ఇంతలా నిధులు, పథకాలు, పదవులు ఇవ్వడం అనేది ఎక్కడ చూసి ఉండారు. ఉప ఎన్నికల్లో గెలవడానికి అనేక ప్రభుత్వ పథకాలు, భారీగా నిధులు, అదే నియోజకవర్గం నుండి పదవులు ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాల్సిన రెషన్ కార్డులు సైతం అక్కడి నుండి ప్రారంభం చేశారు. ఇక 57 ఏళ్ల పెన్షన్ల ప్రక్రియ అక్కడి నుంచే మొదలుపెడుతూ జీవో విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ, కొత్త రోడ్లు, గతంలో బీసీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన మంజూరు చేయడం లాంటివి అక్కడి నుండే మొదలు పెట్టారు. నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఆయా మున్సిపాలిటీలకు రెండు వందల కోట్లను విడుదల చేశారు.
పథకాలు, నిధులు మాత్రమే కాదు భారీగా నామినేటెడ్ పదవులను సైతం హుజూరాబాద్ వాసులకే కట్టబెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది. కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ, గెల్లు శ్రీనివాస్ టీఆరెస్ అభ్యర్థి టికెట్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బండ శ్రీనివాస్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎల్ రమణకు, పెద్దిరెడ్డికి కూడా రాజకీయంగా పెద్దపీట వేసే అవకాశం ఉంది. ప్రజలకు హామీల వర్షం కురిపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు నేతలు. ఇప్పటికే ఇచ్చిన హామీలు, పథకాల అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. హుజురాబాద్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని కొత్త రాజకీయాలకు తెర లేపారు.