కశ్మీర్ ప్రజలను వణికిస్తున్న చలిగాలులు
* శ్రీనగర్, కశ్మీర్ లోయలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత * గడ్డకట్టిన దాల్ సరస్సు, కుంటలు, నదులు * ఖాజీగండ్‌లో మైనస్ 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత * శ్రీనగర్‌లో మైనస్ 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
తీవ్రమైన చలిగాలులు కశ్మీర్ను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఆప్రాంతంలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరడంతో ప్రసిద్ధి గాంచిన దాల్ సరస్సుతోపాటు పలు నదులు, కుంటలు గడ్డ కట్టిపోయాయి.
శ్రీనగర్, కశ్మీర్ లోయతోపాటు వివిధ ప్రాంతాల్లో రోడ్ల మీద పెద్ద మొత్తంలో మంచు పేరుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కశ్మీర్ లోయ ముఖ ద్వారమైన ఖాజీగండ్‌లో మైనస్ 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత, అదేవిధంగా శ్రీనగర్‌లో మైనస్ 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.