దేశంలో ముంచుకొస్తున్న బొగ్గు సంక్షోభం.. 4.25 కోట్ల టన్నుల బొగ్గు కొరత...

Coal Crisis - India: గతంలో వేసిన అంచనాల కన్నా 15 శాతం అధికం...

Update: 2022-05-29 05:55 GMT

దేశంలో ముంచుకొస్తున్న బొగ్గు సంక్షోభం.. 4.25 కోట్ల టన్నుల బొగ్గు కొరత...

Coal Crisis - India: దేశంలో బొగ్గు సంక్షోభం రోజు రోజుకు ముదురుతోంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో అంతర్జాతీయ బొగ్గు దిమతులకు బ్రేక్ పడ్డాయి. దీంతో బొగ్గు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో 13 శాతం బొగ్గు నిల్వలు పడిపోయాయి. ఉన్న బొగ్గుతో కేవలం 8 రోజులకు సరిపడా విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

ఆ తరువాత పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. మరోవైపు విద్యుత్‌ కోతలు తీవ్రమయ్యాయి. మరోవైపు బొగ్గును సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. దాదాపు 900 రైళ్లను రద్దు చేసి.. బొగ్గు సరఫరాకు రైల్వే శాఖ కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో.. అంటే.. జూన్‌ నుంచి సెప్టెంబరు నాటికి దేశంలో భారీ బొగ్గు కొరత నెలకొననున్నది. ఈ త్రైమాసికంలో 19 కోట్లా 73లక్షల టన్నుల బొగ్గు అవసరం.

తాజా గణాంకాల ప్రకారం.. 15 కోట్ల 47 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే సరఫరా అయింది. సెప్టెంబరు చివరి నాటికి 4 కోట్ల 25 లక్షల టన్నుల బొగ్గు కొరత ఏర్పడనున్నది. ఇది గతంలో వేసిన అంచనాల కన్నా.. 15 శాతం అధికం. గతంలో కేవలం 37 టన్నుల కొరత ఏర్పడవచ్చని అంచనా వేశారు. అయితే ఊహించిన దాని కన్నా.. అధికంగా విద్యుత్‌ డిమాడ్‌ పెరగడం.. గనుల్లో బొగ్గు ఉత్పత్తి తక్కువగా ఉండడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కూడా బొగ్గు సంక్షోభానికి కారణం. ఆ రెండు దేశాల నుంచి భారీగా భారత్‌ బొగ్గు దిగుమతి చేసుకోంటోంది. యుద్ధం ప్రారంభమవడంతో దిగుమతులు నిలిచిపోయాయి.

38 ఏళ్లలో ఎన్నడూ లేనంత బొగ్గు సంక్షోభం నెలకొన్నది. జూలై నాటికి దేశంలోని పలు విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ఖాళీ కానున్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోల్‌ ఇండియా ఆధ్వర్యంలో బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు యత్నిస్తోంది. బొగ్గు దిగుమతులకు ఆయా రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందాలు ఇంకా కుదుర్చుకోలేదు. ఇప్పటివరకు కోల్‌ ఇండియాకు కేవలం ఒకే టెండర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. బొగ్గు దిగుమతులకు టెండర్లు వేయకపోతే.. సరఫరాను నిలిపేస్తామని విద్యుత్‌ ఉత్త్తి ప్లాంట్లను కేంద్రం హెచ్చరించింది. అయితే విదేశీ బొగ్గును కేంద్రమే కొనుగోలు చేసి.. పంచాలని.. రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. బొగ్గు దిగుమతులతో రాష్ట్రాలపై మరింత భారం పడుతుందని.. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన డిస్కంలపై మరింత భారం పడుతుందని తెలిపాయి. అయితే దీనికి కేంద్ర బొగ్గు, విద్యుత్‌ శాఖ మంత్రుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదని తెలిసింది.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 78 కోట్ల 46 లక్షల టన్నుల బొగ్గు అవసరమని అంచనా వేస్తున్నారు. అయితే ఇది గతంలో వేసిన అంచనా కంటే.. దాదాపు మూడు రెట్లు ఎక్కువ. గతంలో వేసిన అంచనా ప్రకారం కోటి 77 లక్షల టన్నుల బొగ్గు కొరత ఉండేది. అయితే పెరిగిన డిమాండ్‌ మేరకు కొరత కూడా తీవ్రమైంది. ప్రస్తుతం వార్షిక బొగ్గు కొరత 4 కోట్ల 93 లక్షల టన్నులుగా అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రాలకు కేటాయించాల్సిన బొగ్గు సరఫరాను కోల్‌ ఇండియా ముమ్మరం చేసింది. ఆయా రాష్ట్రాల్లోని బొగ్గు గనుల బొగ్గును రైళ్త ద్వారా చేయనున్నది. అందుకు రైల్వే శాఖ భారీగా రైళ్లను కేటాయించింది. రెండ్రోజుల్లో 900 రైళ్లను రద్దు చేసింది. వాటన్నింటినీ బొగ్గు తరలింపునకు పంపుతున్నట్టు తెలుస్తోంది. బొగ్గు ఆయా రాష్ట్రాలకు చేరితే.. విద్యుత్‌ కోతలు తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే పలు రాష్ట్రాల్లో భారీ కోతలు విధించే అవకాశం ఉంది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తమపై భారం పడకుండా ఉండేందుకు కేంద్రం కొత్త విధానాలను తెరపైకి తెస్తోంది. తాజా నిర్ణయం ప్రకారం విదేశీ బొగ్గును విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు జెన్‌లతోనే కొనుగోలు చేయించేందుకు కేంద్రం యత్నిస్తోంది. అంతేకాదు.. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఇకపై వారం వారం కనీసం 15 శాతం బిల్లులను చెల్లించాలని డిస్కంలకు కేంద్ర విద్యుత్‌ శాఖ రెండ్రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 15 శాతం చెల్లించకపోతే.. ఒప్పందం ప్రకారం డిస్కంలకు అమ్మాల్సిన విద్యుత్తులో 15 శాతాన్ని విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు అమ్ముకోవడానికి వీలు కల్పిస్తోంది. ఈ నిబంధన 2023 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. బొగ్గులో తప్పనిసరిగా 10శాతం విదేశాల నుంచి దిగుమతి చేసిన దాన్ని వాడాలనే నిబంధన కూడా విధించింది.

కేంద్రం విధిస్తున్న పన్నులు, బొగ్గు కొరత కారణంగా.. విద్యుత్‌ చార్జీలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివకే పెరిగిన ధరలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. కరెంటు కోతలతో మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వాపోతున్నారు. 

Tags:    

Similar News