CM Yediyurappa work from home: కొన్ని రోజులు 'వర్క్ ఫ్రం హోం' చేయనున్న సీఎం యడియూరప్ప!
CM Yediyurappa work from home: కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి కరోనా సెగ మరోసారి సోకింది. దీనితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హోం స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోయారు
CM Yediyurappa work from home: కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి కరోనా సెగ మరోసారి సోకింది. దీనితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హోం స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోయారు. సీఎం ఆఫీసులో పనిచేసే సిబ్బంది ఒకరికి కరోనా సోకడంతో అయన కొద్దిరోజులు ఇంటిదగ్గరి నుంచే వర్క్ ఫ్రం హోం చేయనున్నారు. బెంగళూరు డాలర్ కాలనీలోని తన వ్యక్తిగత నివాసంలో సీఎం బస చేయనున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. దీనికి ముందు సీఎం ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగికి జూన్19 కరోనా సోకింది. ఆ తరవాత జూన్ 25న మరో నలుగురికి కరోనా సోకింది.
ఇక సీఎం కార్యాలయానికి కరోన సెగ తాకడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే దీనిపైన యడియూరప్ప స్పందిస్తూ.. తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని, కరోనా రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇక కర్ణాటకలో గురువారం రికార్డు స్థాయిలో 2228 కేసులు నమోదు అయ్యాయి. దీనితో తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 31, 105కు పెరిగింది.
అటు దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 26,506 కేసులు నమోదు కాగా, 475 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసులు సంఖ్య 7,93,802కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,76,685 ఉండగా, 4,95,512 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 21,604 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,83,659 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.