Supreme Court: సుప్రీం చీఫ్ జస్టిస్‌గా తెలుగు తేజం
Supreme Court: దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, జస్టిస్ ఎన్.వీ.రమణ నియమితులు కాబోతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Supreme Court: దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, జస్టిస్ ఎన్.వీ.రమణ నియమితులు కాబోతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బోబ్డే పదవీ కాలం ఏప్రిల్ 23తో ముగియనుండడంతో తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు జడ్డీగా ఉన్న ఎన్.వీ.రమణను నియమించాలంటూ సిఫారసు చేసారు. ఈ ప్రక్రియలో ఏప్రిల్ నెలాఖరులో రమణ సుప్రీంకోర్టుకు 48వ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
జస్టిస్ ఎన్.వీ. రమణగా అందరికీ సుపరిచితులైన ఆయన పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగస్టు 27వ తేదీన ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతి లోని ఆర్.వి.వి.ఎన్.కాలేజీలో బియస్సీలో పట్టా పొందారు. 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 నుంచి న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు.
2000 జూన్ లో ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన రమణ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 7 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా రమణ రెండో తెలుగు వ్యక్తిగా నిలుస్తున్నారు. ఇంతకు మందు 1966లో చీఫ్ జస్టిస్‌గా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు.
ఐతే, 2020లో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి భూముల వ్యవహారంలో జస్టిస్ రమణ కుటుంబీకుల జోక్యం వుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఐతే, ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు సీజేఐ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ. ఆయన పదవీ కాలం 2022 ఆగస్టు 26వ తేదీ వరకు ఉంది.