అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరుల్ని చైనా సైన్యం తిరిగి భారత దళాలకు శనివారం అప్పజెప్పింది. ఈ మేరకు భారత సైన్యం ప్రకటించింది. సరిహద్దుల్లో వేట కోసం వెళ్లిన ఈ యువకులు చైనా సైనికులకు చిక్కారు. అయితే, భారత సైన్యానికి సాయం చేస్తూ వీరు గల్లంతయ్యారని స్థానికులు పేర్కొన్నారు. చైనా భూభాగంలోకి వెళ్లిన ఆ ఐదుగురు యువకులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ), భారత ఆర్మీకి అప్పగించింది.
సెప్టెంబర్ 2వ తేదీన అదృశ్యమైన అరుణాచల్ యువకులు చైనా భూభాగంలోకి వెళ్లినట్లు అక్కడి ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. ఈ క్రమంలో చైనా ఆర్మీతో ఇండియన్ ఆర్మీ సంప్రదింపులు జరిపి.. ఐదుగురు యువకులను సురక్షితంగా తీసుకొచ్చింది. శనివారం ఉదయం 9:30 గంటలకు పీఎల్ఏ ఆ ఐదుగురిని అరుణాచల్‌లోని కిబితూ బోర్డర్ వద్ద ఇండియన్ ఆర్మీకి అప్పగించింది. యువకులు సురక్షితంగా తిరిగి రావడంతో వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.