Family Pension: పెన్షన్ కొత్త నిబంధనలు.. మరణించిన ఉద్యోగి పిల్లలు వికలాంగులైతే..?
Family Pension: పెన్షన్ కొత్త నిబంధనలు.. మరణించిన ఉద్యోగి పిల్లలు వికలాంగులైతే..?
Family Pension: మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మానసిక రుగ్మతతో బాధపడుతుంటే వారికి తప్పకుండా కుటుంబ పెన్షన్ అందిస్తామని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను విడుదల చేసింది. ఇలాంటి పిల్లలకు కుటుంబ పెన్షన్ అందడంలేదని పెద్దయ్యాక వారు అభాగ్యులుగా మిగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పిల్లలకు పెన్షన్ ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఈ పిల్లల నుంచి కోర్టు జారీ చేసిన గార్డియన్‌షిప్ సర్టిఫికేట్‌ను అడుగుతున్నాయి. సామాన్య ప్రజల జీవితాలను సులభతరం చేసేందుకు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇందుకోసం వారికి కూడా పెన్షన్ అందించేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
ఉద్యోగుల పిల్లలకు ఎలాంటి అంతరాయం లేకుండా పింఛను పొందేందుకు కుటుంబ పెన్షన్‌లో నామినేషన్‌ను తప్పనిసరి చేశారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలు కోర్టు నుంచి సంరక్షక ధృవీకరణ పత్రాన్ని సులభంగా పొందవచ్చు. దీని ఆధారంగా కుటుంబ పెన్షన్ అందుతుంది. అటువంటి పిల్లల నుంచి సంరక్షక ధృవీకరణ పత్రం కోసం బ్యాంకులు కూడా డిమాండ్ చేయకూడదు. ఒకవేళ బ్యాంకులు నిరాకరిస్తే అది సెంట్రల్ సివిల్ సర్వీస్ (పెన్షన్) రూల్స్, 2021లోని చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది.
మానసిక రుగ్మతతో బాధపడుతున్న పిల్లవాడు అతని తల్లిదండ్రుల పెన్షన్ ప్లాన్‌లో నామినీగా లేకుంటే అతని నుంచి కోర్టు సర్టిఫికేట్ కోరినట్లయితే అది పెన్షన్ ప్రయోజనానికి విరుద్ధంగా ఉంటుంది. కోర్టు సర్టిఫికేట్ లేకుండా వికలాంగ పిల్లలకు బ్యాంకులు పింఛన్ ఇవ్వడం లేదని పింఛను శాఖకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. అందుకే ఇలాంటి పిల్లలకు పింఛన్ ఇవ్వాలని అన్ని పింఛన్లు పంపిణీ చేసే బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి.