Chhattisgarh Encounter News: ఛత్తీస్‌గడ్‌లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్ - దంతెవాడ సరిహద్దుల్లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఈ ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్ద విజయంగా అక్కడి భద్రతా బలగాలు పేర్కొన్నాయి. నారాయణపూర్ - దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం ఉన్నట్లుగా చత్తీస్‌గడ్ పోలీసులకు స్పష్టమైన సమాచారం అందింది. ఈ సమాచారంతోనే చత్తీస్‌గడ్‌కి చెందిన డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్ (DRG), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) బలగాలు నిన్నటి నుండే జాయింట్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి.
మావోయిస్టుల వేటలో ఉన్న భద్రతా బలగాలకు ఇవాళ మధ్యాహ్నం అటవీ ప్రాంతంలో వారు తారసపడ్డారు. దీంతో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. గంటల తరబడి జరిగిన ఈ ఎన్కౌంటర్లో 36 మంది మావోలు హతమైనట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ ఘటనాస్థలం నుండి అసాల్ట్ రైఫిల్స్, ఏకే సిరీస్ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
నారాయణపూర్ - దంతెవాడ సరిహద్దుల్లోని ఓర్చా, బర్సూర్ పోలీసు స్టేషన్ల పరిధిలోని గోవెల్, నెండూర్, తుల్‌తులి గ్రామాల పరిసరాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని చత్తీస్‌గడ్ పోలీసులకు స్పష్టమైన సమాచారం అందినట్లుగా తెలుస్తోంది.