Chhattisgarh Attack: బీజాపూర్ అడవుల్లో రక్త తర్పణం.. ఎవరీ హిడ్మా?

Chhattisgarh Attack: అతడు చదివింది 10వ తరగతి. ఇంగ్లీష్‌ చక్కగా, స్పష్టంగా మాట్లాడగలడు.

Update: 2021-04-05 14:03 GMT

Chhattisgarh Attack: బీజాపూర్ అడవుల్లో రక్త తర్పణం.. ఎవరీ హిడ్మా?

Chhattisgarh Attack: అతడు చదివింది 10వ తరగతి. ఇంగ్లీష్‌ చక్కగా, స్పష్టంగా మాట్లాడగలడు. ఏం ప్లాన్‌ చేసినా సక్సెస్‌ ఏ. అతడే బీజాపూర్‌-సుక్మా ప్రాంతంలో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నాయకుడు హిడ్మా. సుక్మా జిల్లా పువర్తి ప్రాంతంలో ఆదివాసి తెగకు చెందిన వ్యక్తి హిడ్మా. చూడ్డానికి బక్కగా కనిపిస్తున్నా మనిషి మాత్రం చాలా డేంజరస్‌. హిడ్మా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి.

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో జరిగిన మారణకాండలో పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌ నంబర్‌ 1 పాల్గొంది. ఈ దళం హిడ్మా నేతృత్వంలో పనిచేస్తోంది. దీనిలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్‌ ఆయుధాలను కలిగి ఉంటారు. దళాలపై దాడుల అనంతరం వారి నుంచి అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లను ఈ బెటాలియన్‌ ఎక్కువగా వాడుతుంటుంది.

ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు హిడ్మా ఏం ప్లాన్‌ చేసినా సక్సెస్‌ ఏ. అందుకే, హిడ్మా అత్యంత వేగంగా మావోయిస్టు కేంద్రకమిటీలో సభ్యుడిగా స్థానం దక్కించుకొన్నాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ, సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి హిడ్మా. ఇతడి నేతృత్వంలో జరిగే దాడుల్లో భద్రతా దళాలకు అపారమైన నష్టం వాటిల్లుతుంది. గతంలో సుక్మా సమీపంలో జరిగిన దాడుల్లోనూ భద్రతా దళాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూశాయి.

సుక్మా చుట్టుపక్కల అడవుల్లోని మార్గాలపై హిడ్మాకు బలమైన పట్టుంది. అలాగే అతడికి గ్రామస్థుల మద్దతు కూడా లభిస్తోంది. దీంతో బలమైన ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. అతను ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికల సమాచారం కూడా హిడ్మాకు ఇట్టే తెలిసిపోతుంది.

2010 నుంచి ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల దాడులను పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తోంది. పక్కాగా వేసవి సీజన్‌ మొదలయ్యాకే నక్సల్స్‌ భద్రతా దళాలపై భారీ దాడులు చేశారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఈ దాడులు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఈ దాడుల్లో పదుల సంఖ్యలో జవాన్లు, నాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ మావోయిస్టు కమాండర్‌ హిడ్మా వ్యూహాలతోనే జరిగాయి.

కొన్నేళ్ల నుంచి హిడ్మా కోసం సీఆర్పీఎఫ్‌, కోబ్రా, పోలీస్‌ దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. బీజాపూర్‌-సుక్మా సమీపంలోని అడవుల్లో హిడ్మా సహా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు దళాలకు సమాచారం అందింది. దీంతో వందల కొద్దీ సిబ్బందితో గాలింపు చేపట్టారు. అయితే దళాలకు ఎవరూ దొరక్కపోవడంతో తిరుగుముఖం పట్టిన సమయంలో పక్కా ప్రణాళికతో హఠాత్తుగా దాడి చేశారు మావోయిస్టులు. దాడి ఘటనను పరిశీలిస్తే దళాలను మావోయిస్టులు ఉచ్చులోకి లాగారనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి మావోయిస్టుల వ్యూహాలకు భద్రతా దళాలు ఏ విధమైన ప్రతి వ్యూహం అమలు పరుస్తారో ‎వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News