Chandrayaan 3: చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ‘టైం ఫిక్స్‌’..!

Chandrayaan 3: ఈనెల 23 సాయంత్రం 5గంటల 45నిమిషాలకు బదులు

Update: 2023-08-21 02:49 GMT

Chandrayaan 3: చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ‘టైం ఫిక్స్‌’..!

Chandrayaan 3: భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ చంద్రుని ఉపరితలానికి మరింత సమీపించింది. ల్యాండర్‌ మాడ్యూల్‌ కక్ష్యను తగ్గించే రెండో డీబూస్టింగ్‌ ఆపరేషన్‌ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. చంద్రుని దక్షిణధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ఆపరేషన్‌ సమయాన్ని ఈనెల 23 సాయంత్రం 6గంటల 4 నిమిషాలకు మార్చిన ఇస్రో... ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశప్రజలు తిలకించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ మాడ్యూల్... చంద్రుని ఉపరితలానికి మరింత చేరువైంది. ల్యాండర్‌ మాడ్యూల్‌ కక్ష్యను తగ్గించేందుకు చేపట్టిన రెండో డీ-బూస్టింగ్ ఆపరేషన్ విజయవంతం అయినట్లు ఇస్రో ప్రకటించింది. ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను 25 కిలోమీటర్లు బై 134 కి.మీ తగ్గించినట్లు తెలిపింది. ఈనెల 23న చంద్రుని దక్షిణధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్​కు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. అయితే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయం మారింది. ముందు ఈనెల 23న సాయంత్రం 5గంటల 45నిమిషాలకు నిర్ణయించిన ఇస్రో... తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల 4నిమిషాలకు మార్చింది. సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ముందు ల్యాండర్‌ మాడ్యూల్‌లో అంతర్గత తనిఖీలు చేయనున్నట్లు ఇస్రో తెలిపింది. ల్యాండింగ్‌ ప్రాంతంలో సూర్యోదయం వరకు వేచి చూడనున్నట్లు వెల్లడించింది.

ఈనెల 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉన్న చంద్రయాన్‌-3 మిషన్‌... అంతరిక్ష అన్వేషణలో చారిత్రక మైలురాయిని చేరనుందని ఇస్రో తెలిపింది. సుమారు 30కిలోమీటర్ల ఎత్తులో శక్తితో కూడిన బ్రేకింగ్ దశలోకి ప్రవేశించినున్న ల్యాండర్... చంద్రుని ఉపరితలంపై దిగటానికి థ్రస్టర్లను ఉపయోగించుకోవడం ప్రారంభిస్తుందని పేర్కొంది. దాదాపు 100మీటర్ల ఎత్తులో సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఏమైనా అడ్డంకులు ఉన్నాయో లేదో తనిఖీ చేసేందుకు... ల్యాండర్‌ చంద్రుని ఉపరితలాన్ని స్కాన్‌ చేస్తుందని వెల్లడించింది. ఈ ప్రక్రియను వివిధ వేదికలపై ప్రత్యక్షప్రసారం ద్వారా చూసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. ఈనెల 23న సాయంత్రం ఐదు గంటల 27నిమిషాలకు ఇస్రో వెబ్‌సైట్‌, ఇస్రో యూట్యూబ్‌ చానల్‌, ఇస్రో ఫేస్‌బుక్‌ ఫేజ్‌, డీడీ నేషనల్‌ ఛానల్‌లో ప్రత్యక్షప్రసారంచేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది.

చంద్రయాన్‌-3 మిషన్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను తిలకించే విధంగా ప్రత్యక్షప్రసారానికి ఏర్పాట్లు చేయాలని దేశంలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను ఇస్రో కోరింది. చంద్రయాన్‌-3 మిషన్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చిరస్థాయిగా నిలిచేఘట్టం ఆసక్తి రేపటంతో పాటు యువత మనసులో అన్వేషణ పట్ల మక్కువ పెంచుతుందని ఇస్రో పేర్కొంది. దేశ శాస్త్ర, సాంకేతిక రంగంలో సాధించిన ఘనతను సమష్టిగా వేడుక చేసుకునేందుకు అవసరమైన ఖ్యాతిని, సమగ్రతను సృష్టిస్తుందని తెలిపింది. ఈ విజయం శాస్త్రీయ నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఇస్రో వెల్లడించింది. ఈ విజయం శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్‌, పరిశ్రమ, అంతరిక్ష పరిశోధనలో... భారత్‌ పురోగతికి ప్రతీకగా నిలవనుందని ఇస్రో పేర్కొంది.

Tags:    

Similar News