Black Fungus: బ్లాక్ ఫంగస్ కూడా కరోనా లాంటి మహమ్మారే- కేంద్రం

Black Fungus: బ్లాక్ ఫంగస్ కూడా కరోనా లాంటి మహమ్మారేనని కేంద్రం గుర్తించి రాష్ట్రాలకు తగిన సూచనలు చేసింది.

Update: 2021-05-20 04:16 GMT

Black fungus:(File Image) 

Black Fungus: కరోనాను మించి బ్లాక్ ఫంగస్ ఇప్పుడు ప్రజలను భయపెడుతోంది. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఉన్నా.. ఆ లక్షణాలు కూడా కరోనాయే అనుకున్నారు. కాని బ్లాక్ ఫంగస్ వేరని.. అది అందరికీ కాకుండా.. కరోనా నుంచి కోలుకున్నవారిని దొంగదెబ్బ తీస్తుందని గుర్తించారు. దీంతో ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయనే దానిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. రాష్ట్రాల వారీగా వేలల్లో బ్లాక్ ఫంగస్ కేసులున్నట్లు తేలింది. ఇది అంతకంతకు పెరుగుతుండటంతో.. కేంద్రం దీనిని కూడా మహమ్మారిగా ప్రకటించింది. మహమ్మారిగా గుర్తించిన వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. అందుకనుగుణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ను రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. అయితే వీరందరికీ చికిత్స అందించేందుకు ప్రభుత్వం జైపూర్‌లోని సవాయ్‌మన్ సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు.ఈ మేరకు రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పేర్కొంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మ్యూకోర్‌మైకోసిస్‌ను అంటువ్యాధిగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని కూడా చేర్చినట్లు వెల్లడించారు.

ఇలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు భారీ సంఖ్య‌లో వెలుగుచూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి పాలిట శాపంగా మారిన బ్లాక్ ఫంగస్ ని కేంద్రం ఎపిడమిక్ యాక్ట్ 1897 లో చేర్చింది. దీంతో ఆయా నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు టెన్ష‌న్ పెడుతున్నాయి. పట్టణంలో ఆరు బ్లాక్‌ఫంగస్‌ కేసులు వెలుగుచూసిన‌ట్లు మార్కాపురం కొవిడ్ సెంట‌ర్ ఇన్‌ఛార్జి డాక్టర్ రాంబాబు ఇప్పటికే ప్రకటించారు. అనంతపురం జిల్లాలోనూ బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. జిల్లా వాసుల్లో తాజాగా ఇద్దరికి బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయ్యింది. దాదాపు చాలా జిల్లాల్లో కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ప్రస్తుతం బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు కూడా చేసింది.

Tags:    

Similar News