Ganga water: గంగా నదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం
Ganga water: గంగానది శవాలు కొట్టుకొచ్చిన నేపథ్యంలో ఆ నీటిలో కరోనా అవశేషాలపై పరిశోధన చేయబోతున్నారు
Ganga water: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపించింది. లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడగా వేల సంఖ్యలో బలైపోయారు. ఈ క్రమంలో ఇటీవల యూపీ, బీహార్ ప్రాంతాల్లో గంగానదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గంగానది ఒడ్డున ఇసుకలో కూడా పెద్ద ఎత్తున శవాలు బయటపడ్డాయి. గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకొచ్చిన ఘటనలు చూశాక అందరికీ వచ్చిన అనుమానం ఒకటే.. ఆ మృతదేహాల ద్వారా గంగానదిలో కరోనా అవశేషాలు ఇంకి ఉంటాయా.. దీని వలన ఆ నీరు వాడినవారికీ కరోనా సోకే ప్రమాదముంటుందా అని. ఆ అనుమానం అనుమానంగా ఉండగానే అందరికీ భయం పట్టుకుంది.
సంప్రదాయవాదులు అయితే పవిత్రమైన గంగానదిని అపవిత్రం చేస్తున్నారనే ఆందోళన చేస్తున్నారు. కరోనా భయంతో గంగానదిలో స్నానాలు.. గంగానది ఒడ్డున భక్తి కార్యక్రమాలు అన్నీ వెనకపట్టు పట్టే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. అందుకే ఇప్పుడు గంగానదిలో కరోనా అవశేషాలపై పరిశోధన చేయబోతున్నారు. ఇప్పుడా ఫరిశోధనలో ఏం తేలుతుందనేదే కొత్త టెన్షన్.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో దశలవారీగా అధ్యయనం చేపట్టనుంది. దీనిలో భాగంగా మొదటి దశలో యూపీలోని కన్నౌజ్, బీహార్‌లోని పాట్నా జిల్లాల్లోని 13 ప్రాంతాల నుంచి ఇప్పటికే నమూనాలను సేకరించినట్లు లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ్ బాటిక్ సోమవారం వెల్లడించారు.
అధ్యయనం నిర్వహించే సమయంలో నీటిలో వైరస్‌ల ఆర్‌ఎన్‌ఏ ఉంటే ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని బాటిక్ తెలిపారు. ఈ పరీక్షల ద్వారా నీటిలో వైరస్ ఉనికి లభ్యమవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ అధ్యయనం నది జీవ లక్షణాల పరిశీలనలో సైతం ఓ భాగమన్నారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసీజీ) ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. నదిలో నీరు కలుషితం కాకుండా చూస్తున్నామని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఇటీవల కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సైతం తెలిపారు. గంగానదిలో ఇటీవల కొట్టుకువచ్చిన మృతదేహాలన్నీ కరోనా మృతదేహాలని.. ప్రభుత్వంపై వివర్శలు వ్యక్తమయ్యాయి.