Mask: జనాలకు పెద్ద టాస్క్ అయిన మాస్క్
Mask: మాస్క్ లేకుంటే రిస్క్ తప్పదు * మాస్క్ వాడకంలో బద్ధకంగా వ్యవహరిస్తున్న జనాలు
Mask: మాస్క్ జనాలకు పెద్ద టాస్క్ అయ్యిందా. అది లేకుంటే రిస్క్ అవుతుందని తెలియదా.. ఎందుకంతా నిర్లక్ష్యం. మూతికి గుడ్డ కట్టుకుంటేనే బతికి బట్ట కట్టే పరిస్థితి దాపరించింది. మాస్క్ మస్ట్ అంటూ ప్రభుత్వాలు, వైద్యులు నెత్తినోరు మొత్తుకున్నా.. జనాలు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు. కొందరైతే మాస్క్ పెట్టుకున్నా.. దాన్ని స్టైల్‌గా గడ్డం కిందకు లాగేస్తున్నారు. ఆ పాటిదానికి మాస్క్ పెట్టుకోవడం ఎందరో వాళ్లకే అర్థమవ్వాలి.
అసలు జనాలు ఎందుకు మాస్క్‌లు పెట్టుకోవడం లేదు. కరోనా వైరస్ పొంచి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. పైగా మాస్క్ పెట్టుకున్నా కోవిడ్ వస్తుందని తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలను తెలుసుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సర్వే చేపట్టింది. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందని కొందరు. అసౌకర్యంగా ఉందంటూ మరికొందరు చెబుతున్నారు. సోషల్ డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది మళ్లీ మాస్క్ ఎందుకని ఇంకొందరు సమాధానం చెప్పినట్లు కేంద్రఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ముందు ఉంది ముసళ్ల పండుగ అని కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రధాని మోడీ హెచ్చరిస్తున్నారు. కరోనా రాకుండా ఎవరికీ వారు జాగ్రత్తలు పాటించాల్సిందే అంటూ చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటివిటీ రేటు స్పీడ్ పెంచింది. దీంతో ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంలతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైరస్ కట్టడిపై దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని సూచించారు.