Third Wave: థర్డ్‌వేవ్‌పై కేంద్ర వైద్యశాఖ హెచ్చరికలు
Third Wave: కోవిడ్ ముప్పు ఇంకా పోలేదు-కేంద్రం * అప్రమత్తంగా ఉంటేనే కట్టడి చేయగలం-కేంద్రం
Third Wave: కోవిడ్ నిబంధనలు పాటించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ముప్పు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రానున్న నాలుగు నెలలు రోజులు అత్యంత కీలకమని తెలిపింది. ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ విజృంభిస్తుండటం థర్డ్ వేవ్‌కు సంకేతాలన్న కేంద్రం అప్రమత్తంగా ఉంటేనే ముందున్న ముప్పును ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.
దేశంలో కోవిడ్‌ను తట్టుకునే హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదన్న కేంద్రం కొత్త వేరియంట్లు దాడిచేయొచ్చని హెచ్చరించింది. కొవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని సూచించింది. మయన్మార్, బంగ్లాదేశ్‌లో ఇప్పటికే మొదలైన థర్డ్‌వేవ్ ప్రభావం సెకండ్‌వేవ్‌తో పోలిస్తే తీవ్రంగా ఉన్నదన్నారు కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. లాక్‌డౌన్ ఎత్తేశాక, మాస్కుల వాడకం దాదాపు 74 శాతం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ప్రభావం అధికంగా ఉందనే విషయాన్ని కొట్టిపారేయలేమని హెచ్చరించింది కేంద్రం. చిన్నారులను మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. దీంతో పాటు హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్సకు కావాల్సిన మౌలిక సదుపాయాలను మెరుగు పరచుకోవాలని తెలిపారు.