ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహం
*ఢిల్లీలో రైతుల ఆందోళనలపై ట్వీట్స్‌పై అభ్యంతరం *250 వివాదాస్పద అకౌంట్లను అన్‌లాక్ చేయడంపై సీరియస్
ట్విట్టర్ తీరుపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ట్విట్టర్ ఖాతాల నిలుపుదలపై ఆదేశాలు పాటించకపోవడంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. రైతు ఉద్యమంలో పాల్గొన్న నాయకుల ఖాతాలు, సెలబ్రిటీల ట్వీట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తొలుత రైతుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని ఖాతాలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో పలు ఖాతాలను ట్విట్టర్ అధికారులు నిలిపివేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే నిలిపివేసిన ఖాతాలను పునరుద్ధరించింది ట్విట్టర్. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి.. నోటీసులు జారీ చేసింది.
రైతు ఉద్యమం సందర్భంగా జరిగిన హింసపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై స్పందిస్తూ అమెరికా పాప్ సింగర్ రిహానా మంగళవారం ట్వీట్ చేశారు. మనం దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ ఇంటర్నెట్ సేవల నిలిపివేత అంశంపై స్పందిస్తూ ఆమె ట్వీట్ చేశారు. తాజాగా పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్ కూడా రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. మేము రైతులకు సంఘీభావంగా నిలబడతాం అంటూ ఇంటర్నెట్ సేవల నిలిపివేత వార్తకు సమాధానంగా ఆమె ట్వీట్ పెట్టారు. రిహానా, గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్లతో రైతుల ఉద్యమం ఇతర దేశాల్లోనూ వైరల్‌గా మారింది.