PM Kisan Mandhan Yojana: రైతులకు శుభవార్త.. ఏడాదికి రూ.36,000 పొందే అవకాశం
PM Kisan Mandhan Yojana: ఉద్యోగానికి సెలవిచ్చిన, కంపెనీలు మూతపడ్డ, ప్రభుత్వాలు స్తంబించిన దేశాన్ని విరామం లేకుండా ముందుకు నడిపించే రైతన్న దేశానికే వెన్నెముక. అలాంటి రైతన్న ప్రస్తుత పరిస్థితుల్లో పంట పండించడానికి పడుతున్న కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలనే ఆలోచనతో పిఎం కిసాన్ మన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన కింద 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఏ రైతు అయిన ఈ స్కీంలో చేరితే 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. రైతు ప్రధానమంత్రి కిసాన్ ఖాతాదారుడు అయితే నేరుగా ఆ రిజిస్ట్రేషన్ ని ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ స్కీంలో చేసుకోవచ్చు.
కావాల్సిన పత్రాలు:
1. ఆధార్ కార్డ్
2. గుర్తింపు కార్డు
3. వయస్సు సర్టిఫికెట్
4. ఆదాయ ధృవీకరణ పత్రం
5. సర్వే నంబర్
6. బ్యాంక్ ఖాతా పాస్ బుక్
7. మొబైల్ నంబర్
8. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
కిసాన్ మన్ ధన్ యోజన పథకం కింద నమోదైన రైతులు రూ. 55 నుంచి రూ.200 వరకు నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత వార్షిక పెన్షన్ రూ .36,000 పొందుతారు. దీని కోసం పీఎం కిసాన్ మాన్‌ధన్‌లో కుటుంబ పెన్షన్ కూడా ఉంది. రైతు అకాల మరణం చెందితే జీవిత భాగస్వామికి పథకం వర్తిస్తుంది. ఆ తరువాత ఆమెకు 50 శాతం పింఛను కూడా అందుతుంది. ప్రధానమంత్రి కిసాన్ స్కీం కింద ప్రతి ఏటా అర్హులైన రైతులకి మూడు విడతలుగా 2000 చొప్పున, మొత్తం 6000 కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద అందజేస్తుంది. రైతు మన్ ధన్ స్కీంలో చేరాలి అనుకుంటే ప్రీమియం చెల్లించాల్సిన డబ్బులు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం నుండి వచ్చే డబ్బుల నుంచి కట్ అవుతాయి.