టోల్‌ చెల్లింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

*ఫిబ్రవరి 15 నుంచి ఆన్‌లైన్‌ చెల్లింపులకే వెసలుబాటు *టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు పుల్‌స్టాప్ *వాహన ఓనర్లు ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే..

Update: 2021-02-09 12:07 GMT

Fast Tag

మీకు కారు ఉందా..? మరి ఫాస్టాగ్‌ తీసుకున్నారా..? ఫిబ్రవరి 15 వచ్చేస్తోంది. ఇక నగదు చెల్లింపులు ఉండవు. బండి ముందుకు పోవాలంటే ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిగిపోవాల్సిందే.. టోల్‌ చెల్లింపులకు ప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసింది.

టోల్‌ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు మినహా ఇతర అన్ని వాహనాలకు టోల్‌ను వసూలు చేస్తోంది కేంద్రం. ఆ టోల్‌ ఫీజు కూడా ఆన్‌లైన్‌ చెల్లింపులే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 2017 డిసెంబర్‌ నుంచి కొత్తగా రోడ్డెక్కిన ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనల చట్టం 1989కి సవరణలు చేసింది.

2017 డిసెంబర్‌ కంటే ముందు విక్రయించిన వాహనాలకు 2021 జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి. ఇదే విషయంపై కేంద్రం గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఫిబ్రవరి 15 వరకు గడువు పొడగించింది. ఇక ఫిబ్రవరి 15 వస్తే.. అంతా ఆన్‌లైన్‌ మయమే.

ఫాస్టాగ్‌ ద్వారా ఇంధనం, సమయం ఆదా అవుతాయని భరోసా ఇస్తోంది కేంద్రం. కానీ ఇప్పటికీ చాలా మంది వాహనదారులు ఫాస్టాగ్‌ తీసుకోకుండానే ప్రయాణం సాగిస్తున్నారు. అలాంటి వారి నుంచి రెండు రెట్లు టోల్‌ ఫీజు వసూలు చేస్తామని కేంద్రం రవాణా శాఖ ప్రకటించింది. వినియోగదారుల సౌలభ్యం కోసం టోల్‌ప్లాజాల వద్ద పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ వద్ద నగదు రీఛార్జి సౌకర్యం కూడా కల్పించారు. మరీ ఇంకేందుకు ఆలస్యం కార్ల ఓనర్లు ఫాస్టాగ్‌ తీసేసుకొండి మరీ.

Tags:    

Similar News