సోషల్‌మీడియా.. మానవుడి చేతిలో బ్రహ్మాస్త్రం. ఈ ఆధునిక కాలానికి సోషల్‌మీడియా ఓ ఆక్సిజన్ లా మారింది. సోషల్‌మీడియాతోనే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. ఇన్నాళ్లు ఫ్రీ బర్డ్‌గా ఉన్న సోషల్‌మీడియాకు ఇప్పుడు ఆంక్షాలు వచ్చేశాయి. సోషల్ మీడియా స్వేచ్ఛకు పరిమితులు వచ్చాయి. మా మెసేజ్.. మా ఇష్టం అనే రోజులు పోయాయి. పొరపాటున తప్పుడు మెసేజ్ పెడితే.. పోలీసులు మీ ఇంటి డోర్ కొట్టే రోజులు వచ్చేశాయి. ఇంతకీ సోషల్‌మీడియాకు ఆంక్షాలు ఉండాల్సిందేనా.. మరీ వ్యక్తిగత సమాచార భద్రత పరిస్థితి ఏంటి.?
ఇతిహాసాల్లో మాయలు, మంత్రాల గురించి విన్నాం. ఆ మాయ ప్రపంచాన్ని కళ్లముందు ఉంచుతోంది సోషల్‌మీడియా సమాచారం అక్షర రూపమైన, దృష్య రూపమైనా క్షణాల్లో చేరవేస్తోంది. దేశాల హద్దులను చేరిపేసి ప్రపంచాన్ని ఓ ఉమ్మడి గ్రామంగా మార్చింది.
సోషల్ మీడియా ముసుగులో అసలు మీడియా కంటే ఆకతాయిల అలజడి ఎక్కువైంది. ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ అసభ్యకర, తప్పుడు మెసేజ్‌లు పోస్టు చేస్తూ లేనిపోని తంటాలు తీసుకువస్తున్నారు. వీటిపై నియంత్రణ లేకపోతే పరిణామాలు తప్పవనే ఆందోళన ఎప్పటినుంచో ఉంది. అందుకే సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కట్టడికి ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది కేంద్రం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అశ్లీలత ఎక్కువైంది. సెన్సార్‌కు అవకాశం లేకపోవడంతో వల్గారిటీ ఎక్కువైంది. మరోవైపు ఒక వర్గాన్ని, మహిళలను టార్గెట్ చేస్తూ భయంకర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముస్యూజ్ అవ్వకుండా కేంద్రం ఆంక్షలు తీసుకువచ్చింది. కేంద్ర నిర్ణయాన్ని కొందరు సినీనిర్మాతలు, నెటిజిన్లు స్వాగతిస్తున్నారు.
సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించాలంటే ప్రస్తుత చట్టాలు సహకరించవు. అందుకే ఐటీ చట్టంలో భారీ సవరణలకు కేంద్రం పూనుకుంది. ఓ ముసాయిదా కమిటీని కూడా నియమించింది. ఇప్పుడా కమిటీ కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇంతకీ ముసాయిదా కమిటీ తీసుకువచ్చిన ఆ గైడ్‌లైన్స్ ఏంటి. డిజిటల్ మీడియా సంస్థలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి.
సోషల్‌మీడియాపై నియంత్రణ కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు -2021 ముసాయిదాను మొదటిసారిగా కేంద్రం రూపొందించింది. డిజిటల్ న్యూస్ సంస్థలు, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఒటీటీలను ఏవిధంగా నియంత్రించాలో ఈ ముసాయిదాలో సూచించింది కేంద్రం. ఈ నిబంధనల ప్రకారం సోషల్‌మీడియాపై పలు మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ ఉండనున్నట్లు సమాచారం. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రభావితం చేసే, జాతి భద్రతకు ముప్పు కలిగించే సందేశాలను నిషేధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేయనున్న ఈ ముసాయిదాలోని నిబంధనల కాపీని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ రిలీజ్ చేసింది. రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, గృహ, ఐ అండ్ బి, లా, ఐటీ, మహిళల, శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఓ పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏదైనా సోషల్‌మీడియా సంస్థపై ఫిర్యాదులు వస్తే ఆ సంస్థను విచారించేందుకు ఈ కమిటీకి సుమోట అధికారాలు ఉంటాయి.
ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే షేర్ చేసే కంటెంట్‌ను సెన్సార్ చేసే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా అనుచితమైన, అభ్యంతరకరమైన కంటెంట్ ప్రజల్లోకి సులువుగా వ్యాప్తి కాకుండా అడ్డుకట్ట వేసినట్లు అవుతుందనేది కేంద్రం వాదన.
కానీ కేంద్ర నిర్ణయంపై సోషల్ మీడియా సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఇంటర్నెట్ కంపెనీలు విమర్శలు గుప్తిస్తున్నాయి. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళ్తోందని ఆ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ రూల్స్ వల్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగే ప్రమాదముందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా సోషల్‌మీడియా ఆకతాయిలకు, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సీరియస్‌గా ప్రయత్నిస్తోంది.