Central Election Commission: విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం
Central Election Commission: కరోనా విజృంభన నేపథ్యంలో ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
Central Election Commission: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఈ తరుణంలో చికిత్స పొందుతూ మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఎందరో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కోవిడ్ మహమ్మారి కబళించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు మంగళవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతం సహా తమిళనాడు, కేరళ, అసోంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తికాగా.. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మే 2న తేదీన ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది.
కనీసం కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా ఎన్నికల సంఘం సరైన ప్రణాళికలు అమలు చేయకపోతే మే 2వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు ముందు కొవిడ్ ప్రోటోకాల్స్ ఎలా అమలు చేస్తోరా బ్లూప్రింట్ సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సంబంధిత రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం పొందేందుకు విజేతతో పాటు మరో ఇద్దరికి అవకాశం కల్పించింది. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఎన్నికల్లో కొవిడ్ నిబంధనల అమలు విషయంలో మద్రాస్ హైకోర్టు ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ కేసులు కొనసాగుతున్నప్పటికీ ర్యాలీలు, రోడ్‌షోల్లో ఆంక్షల అమలులో పూర్తిగా విఫలమైందని, 'కరోనా సెకండ్ వేవ్‌కు ఏకైక కారణం ఈసీ అని, ఇందుకు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని' న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.