Army: రక్షణ దళాల్లోకి అమ్మాయిలు

Army: సాయుధ బలగాల్లో చేరడానికి ఎదురుచూస్తున్న అమ్మాయిలు

Update: 2021-09-09 03:37 GMT

భారత బలగాల్లో అమ్మాయిలకు అవకాశం (ఫైల్ ఇమేజ్)

Army: సాయుధ బలగాల్లో చేరడానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమ్మాయిలకు రక్షణ దళాలు స్వాగతం పలకనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీల్లో ప్రవేశం, శిక్షణ కోసం అమ్మాయిలను కూడా అనుమతించనున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు ఇంటర్‌ చదివిన, పెళ్లికాని అబ్బాయిలు మాత్రమే వీటిలో ప్రవేశానికి అర్హులు. అయితే ఈ నిబంధన వల్ల అమ్మాయిలు అవకాశాలు కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ కుష్‌ కల్రా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అమ్మాయిలను కూడా ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు అనుమతించేలా యూపీఎస్సీని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. గత నెలలో దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆయా పరీక్షలకు అమ్మాయిలను అనుమతించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అమ్మాయిలను ఎన్‌డీఏ, ఎన్‌ఏ విభాగాల్లోకి అనుమతించాలని డిఫెన్స్‌ ఫోరెన్సిక్‌కు చెందిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం కోర్టుకు తెలిపింది.

దీనిపై విధివిధానాలను రూపొందించి అఫిడవిట్‌ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరింది. అయితే ఈ ఏడాదికి పరీక్షను యథాతథంగా నిర్వహించడానికి అనుమతివ్వాలని కోర్టును అభ్యర్థించింది. దీనికి స్పందిస్తూ... కోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు వేచిచూడకుండా రక్షణ దళాలు తామంతట తామే చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండు వారాల తర్వాత మళ్లీ ఈ అంశంపై విచారణ చేపడతామని పేర్కొంది. 

Tags:    

Similar News