NSE Scam: కో-లొకేషన్ కుంభకోణంపై నోరు విప్పని చిత్రా రామకృష్ణ
NSE Scam: తాజాగా చిత్రా రామకృష్ణ జ్యుడీషియల్ రిమాండ్
NSE Scam: ఆమె సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదు. యోగి ఆదేశిస్తాడు. ఆమె పాటిస్తుంది. ఈ క్రమంలో అర్హత లేని వ్యక్తులను అందలమెక్కించింది. అత్యంత గోప్యమైన వివరాలను లీక్ చేసింది. ఆమె తీరుపై కేసు నమోదయింది. విచారణ జరిగింది. కానీ ఆమె నోరు విప్పదు.. విషయం చెప్పదు. ఆమె మరెవరో కాదు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్-ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ. కో లొకేషన కుంభకోణం కేసులో అరెస్టయిన చిత్రకు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తిహార్ జైలుకు పంపింది.
ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ హయాంలో ఆనంద్ సుబ్రమణియన్ నియామకం. పాలనా పరమైన అవకతవకలపై 2018లో సెబీ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి చిత్రను సెబీ విచారణ చేస్తోంది. ఆమె నిర్ణయాల వెనుక ఒక యోగి ఉన్నారని మాత్రమే సెబీ తెల్చింది. అదృశ్యంగా ఉన్న ఆ యోగి కనిపించరని. హిమాలయాల్లో ఉంటారని ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారిపోగలరని సెబీ ఎదుట చిత్రమైన విషయాలను చిత్ర వెల్లడించింది. అంతకుమించి ఆమె నోరు విప్పనే లేదు. అయితే యోగి నిర్ణయాల ప్రభావాన్ని మాత్రం సెబీ గుర్తించింది.
హిమాలయ యోగి, ఆనంద్ సుబ్రమణియన్, చిత్ర విషయంలో ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ఈ వివాదాన్ని ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్- సీబీఐ టేకప్ చేసింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. పలుమార్లు చిత్రా రామకృష్ణను ప్రశ్నించింది. అయినా ఆమె నుంచి ఎలాంటి కొత్త సమాచారాన్ని సేకరించలేకపోయింది. ఇలా అయితే చిత్ర గుట్టు విప్పరని సీబీఐ కష్టడీకి తీసుకుంది. అయినా చిత్ర మాత్రం పాత పాటనే పాడింది. హిమాలయ యోగి ఎవరేది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. సీబీఐ కస్టడీ ముగియడంతో తాజాగా ఆమెకు ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
అయితే రహస్య హిమాలయ యోగి.. మాజీ బ్యూరోక్రాట్ అయి ఉంటారని కొందరు వాదిస్తున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్, ఆర్థిక లావాదేవీలు తెలిసిన వ్యక్తే కావడంతో వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో చిత్రకు ఈ మెయిళ్ల ద్వారా ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆనంద్ సుబ్రమణియనే ఈ వ్యవహారాన్ని నడిపించి ఉంటారని వాదిస్తున్నారు. ఏదైమేనా.. తీహారు జైలులో ఉన్న చిత్ర మాత్రం అసలు విషయం చెప్పడం లేదు. దీంతో అప్పటి ఈ మెయిల్ సందేశాల రికవరీ కోసం సీబీఐ ప్రయత్నిస్తోంది. ఆమేరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సహాయాన్ని కోరింది. ఆ మెయిల్ సందేశాలు ఎలాంటి గుట్టు విప్పుతాయో సీబీఐ ఈ కేసును ఎలా కొలిక్కి తెస్తుందో వేచి చూడాల్సిందే.