Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ..
Odisha Train Accident: సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసిందని తెలిపారు. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని.. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయన్న మంత్రి.. ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందన్నారు.
బాలేశ్వర్, కటక్, భువనేశ్వర్‌లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తోందని మంత్రి చెప్పారు. ఆయా ఆస్పత్రుల్లో వారికి అన్ని వసతులూ కల్పించినట్టు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.