Coronavirus: భారత్‌లో 90శాతం ప్రాంతాల్లో అధికంగా పాజిటివ్ రేటు
Coronavirus: మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లో తగ్గుతున్న కేసులు
Coronavirus: భారత్‌లో సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 90శాతం ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 734 జిల్లాలకుగానూ 640 జిల్లాల్లో పాజిటివిటీ రేటు కేంద్రం నిర్దేశించిన ఐదు శాతం పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలియజేసింది. దేశంలో వైరస్ పాజిటివిటీ రేటు సరాసరి 21శాతం ఉన్నట్లు వెల్లడించింది.
ఇక పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలిస్థానంలో ఉండగా.. పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు 48శాతం ఉండగా, హరియాణాలో 37శాతంగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లో పాజిటివిటీ రేటు ఇప్పుడిప్పుడే పెరుగుతోందని వెల్లడించింది.
మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ సహా 18 రాష్ట్రాల్లో మాత్రం రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని తెలిపింది. బెంగళూరు, చెన్నైతోపాటు ఎర్నాకులం, మలప్పురం నగరాల్లో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇక ప్రస్తుతం మెజారిటీ రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించగా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతోంది.