కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, చంగనాస్సేరి ఎమ్మెల్యే సిఎఫ్ థామస్ మరణించారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న థామస్ తిరువల్లలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 1980లో చంగనాస్సేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన థామస్.. మొత్తం తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2001-2006 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, రిజిస్ట్రేషన్, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. ఆయన దివంగత కేరళ కాంగ్రెస్ (ఎం) నాయకుడు కె.ఎం.మణికి సన్నిహితుడుగా పేరుంది. గత ఏడాది ఏప్రిల్‌లో మణి మరణం తరువాత పార్టీలో రెండు గ్రూపుల మధ్య వివాదం కారణంగా థామస్.. జోసెఫ్ వర్గంలో చేరారు. కేరళ కాంగ్రెస్ జోసెఫ్ వర్గానికి డిప్యూటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు.
ఇక విద్యార్థి దశనుంచే రాజకీయాలను ఒంటబట్టించుకున్న థామస్.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు, ఆ తరువాత చంగనాస్సేరి టౌన్ (వెస్ట్) మండలానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడినుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, మంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కేరళ కాంగ్రెస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. కేరళ కాంగ్రెస్ వ్యవస్థాపక నేతల్లో థామస్ కూడా ఒకరు.