By-Elections in India: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

* ఏపీ, తెలంగాణ, హర్యానా, మిజోరాం..మహారాష్ట్రలో ఒక్కో స్థానానికి పోలింగ్ * నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు

Update: 2021-10-30 03:49 GMT

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు(ఫైల్ ఫొటో)

By-Elections in India: దేశవ్యాప్తంగా మొత్తం మూడు పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో బద్వేలు, తెలంగాణలో హుజూరాబాద్ సహా పలు రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎలక్షన్స్‌ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా స్థానాల పరిధితో కట్టుదిట్టమైన భద్రతను ఈసీ ఏర్పాటు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా అనుసంధానం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేసింది. నవంబర్ 2న ఓట్ల లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు.

దాద్రా నగర్ హవేలీ, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గాలు, అసోంలో అత్యధికంగా ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే అసోం అసెంబ్లీకి ఎన్నికలు జరిగినా గొసాయ్‌గావ్, భబానీపూర్, తెముల్పూర్, మరియని, ధ్వోరా స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

బెంగాల్‌లోని ఖర్దాహా అసెంబ్లీ స్థానం అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యంత కీలకం. ఇక్కడ నుంచి మంత్రి సోవదేబ్ ఛటోపాధ్యాయ బరిలో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భవానీపూర్ నుంచి గెలుపొందినా సీఎం మమతా కోసం రాజీనామా చేశారు.

దీంతో ఆయన ఖర్దాహా నుంచి పోటీ చేస్తున్నారు. ఇక, పశ్చమబెంగా‌ల్‌లోని నాలుగు స్థానాలు దినహాతా, శాంతిపూర్, ఖర్దాహా, గొసాబాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మధ్యప్రదేశ్‌‌లో మూడేసి, బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌లో రెండు స్థానాలు, మహారాష్ట్రలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతోంది.

Tags:    

Similar News