ఫిబ్రవరిలోనే మండుటెండలు.. ఈ ఏడాది వేసవి కాలం ముందుగా వచ్చిందా?
* తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
Summer 2023: మార్చి నెల ఆరంభం కాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని కొంకణ్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 35 నుంచి 39 డిగ్రీల వఅపల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. ఒక్క తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా వేసవికి నెల రోజుల ముందుగానే గరిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ప్రతి ఏడాది ఈ సమయానికి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చితే, ప్రస్తుత ఉష్ణోగ్రతలు చాలా అధికమని IMD చెబుతోంది. తాజా ఉష్ణోగ్రతలను అంచనా వేసి.. ఈ వేసవి మొత్తం ఎండలు అధికంగా ఉంటాయని చెప్పలేమని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూ వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు ఇలా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వివరించారు. ఇక మైదాన ప్రాంతాల్లో 40 కంటే ఎక్కువ, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు వడగాలులు వీస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా ఇంతటి మార్పులు ఎందుకు సంభవించాయి? ఈ ఏడాది వేసవి కాలం ముందుగా వచ్చిందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు. సాధారణంగా పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులను వాయవ్య ప్రాంతంలోని పర్వతాలు అడ్డుకుంటాయి. ఫలితంగా తక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. పర్వత ప్రాంతంలో ఈ ఏడాది వర్షపాతం తగ్గడంతోపాటు, పొడి వాతావరణం నెలకొనడం వల్ల పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులు నేరుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో హైదరాబాద్ వాసులు ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి వాతావరణం వేడెక్కడం మొదలవుతోంది. ప్రస్తుతం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.