Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపుల కేసులో ఫాతిమా ఖాన్ అరెస్ట్.. ఎవరీ ఫాతిమా ఖాన్?
UP CM Yogi Adityanath News: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని బెదిరించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబైని ఆనుకుని ఉన్న థానె జిల్లాలోని ఉల్లాస్ నగర్‌కి చెందిన ఫాతిమా ఖాన్ అనే 24 ఏళ్ల యువతిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాతిమా ఖాన్‌ని బీఎస్సీ చదువుకున్న ఐటి గ్రాడ్యూయేట్‌గా పోలీసులు గుర్తించారు. ఆమెకు మంచి విద్యార్హతలు ఉన్నప్పటికీ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ యువతి తండ్రి టింబర్ బిజినెస్ నడిపిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది. ఫాతిమానే ఈ బెదిరింపులకు దిగారా లేక ఇందులో ఇంకో కోణం ఏదైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
అంతకంటే ముందుగా యోగి ఆదిత్యనాథ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదంటే ఆయన్ని బాబా సిద్ధిఖిని చంపినట్లే చంపేస్తామని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి ఓ మెసేజ్ వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు 10 రోజులు గడువు ఇస్తున్నట్లుగా ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం కోసం త్వరలోనే యోగి ఆదిత్యనాథ్ ముంబైకి రానున్నారు. ఈ క్రమంలోనే బాబా సిద్ధిఖిని చంపినట్లే ఆయన్ని కూడా చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ రావడం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
రంగంలోకి దిగిన ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్
యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు రంగంలోకి దిగి ఆ నెంబర్ ఎవరిది, ఎక్కడి నుండి ఆ మెసేజ్ పంపించారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆ నెంబర్ థానె జిల్లా ఉల్లాస్ నగర్‌కు చెందిన ఫాతిమా ఖాన్‌ది గుర్తించారు. వెంటనే ఉల్లాస్ నగర్ పోలీసులు, ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ఒక జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ప్రస్తుతం ఆమెని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఫాతిమా ఖాన్ అరెస్టుకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఊపిరి పీల్చుకున్న యూపీ పోలీసులు
ఫాతిమా ఖాన్ అరెస్టుతో యూపీ పోలీసులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రాణాలకు హాని పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో యూపీ పోలీసులు ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కొన్ని ప్రత్యేక పోలీసు బృందాలు ముంబైకి కూడా వచ్చినట్లు వార్తలొచ్చాయి.
ఇదిలావుంటే మరోవైపు యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడిపారు. లక్నో నుండి తొలుత ఢిల్లీలోని యూపీ సదన్‌కు వెళ్లిన యోగి, అక్కడి నుండి ముందుగా ప్రధాని నివాసానికి వెళ్లారు.
అక్కడి నుండి కేంద్ర మంత్రి, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లారు. అక్కడ జేపీ నడ్డాతో సమావేశం అనంతరం యూపీ సదన్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.