ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని భేటీ.. బిలియన్ పౌండ్ల పెట్టుబడులకు ఇవాళ ఒప్పందాలు...
Narendra Modi - Boris Johnson: భారత్ పెట్టుబడులతో యూకేలో 11వేల మందికి ఉద్యోగాలు...
Narendra Modi - Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండ్రోజుల భారత్ పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. భారత్-బ్రిటన్ వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యంపై ఇరుదేశ ప్రధానుల మధ్య చర్చ జరగనున్నది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బిలియన పౌండ్ల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. భారత్ పెట్టుబడులుతో యూకేలో 11వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. భారత్‌లో వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ వేసి... బ్రిటన్‌కు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అప్పగింతపై చర్చించే అవకాశం ఉంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు.. ఇప్పుడు ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. బోరిస్ ఉక్రెయిన్‌కు మద్దతు కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇరుదేశాల మధ్య ఒప్పందాలే ప్రధాన ఎజెండాగా ఇటీవలే బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. భారత్‌లో తనకు ఘన స్వాగతం లభించిందని.. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కంటే యూకే-భారత్ సంబంధాలు ఇప్పుడు మరింత పటిష్ఠంగా మారాయన్నారు. అంతకుముందు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన రిసెప్షన్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆయన కలిశారు. ఉదయం 9.30కు రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద పుష్ఫగుచ్చం ఉంచి.. మహాత్మడికి నివాళులర్పించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో కూడా బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ సమావేశం కానున్నారు. ఆ తరువాత ఇరువురు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. తొలిరోజు ప్రధాని బోరిస్ జాన్సన్ బ్రిటన్ నుంచి నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని బోరిస్ సందర్శించారు.
అనంతరం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో గంటపాటు సమావేశమయ్యారు. సాయంత్రం గుజరాత్‌లోని అంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీని, గాంధీనగర్‌లోని అక్షరధామ్ ఆలయాన్ని బ్రిటన్ ప్రధాని సందర్శించారు. నిన్న అర్ధరాత్రి బోరిస్ ఢిల్లీకి చేరుకున్నారు. అయితే బోరీస్ నేరుగా అహ్మదాబాద్ రావడం.. బ్రిటన్‌లోని గుజరాతీ ఓటర్లను ఆకట్టుకోవడానికే అని అక్కడి ప్రతిపక్షాలు చెబుతున్నాయి. బ్రిటన్‌లో గుజరాత్‌కు చెందిన భారతీయులే అధికంగా ఉంటారు.