Corona Updates: కరోనా మరణాల్లో రెండో స్థానంలో బ్రెజిల్
Corona Updates: ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు బ్రెజిల్‌లోనే నమోదు అవుతున్నాయి.
Corona Updates: ఇపుడిపుడే కోవిడ్ నుండి ప్రపంచంలోని కొన్ని దేశాలు తేరుకుంటుండగా మరి కొన్ని దేశాలను ఆ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. అలాంటి దేశాల్లో బ్రెజిల్ ఒకటి. బ్రెజిల్లో కరోనా తో రోజుకి సగటున 2 వేల మంది ప్రాణాలను కోల్పోతున్నారంటే దాని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు బ్రెజిల్‌లోనే నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు 2,59,271 మరణాల నమోదు అయ్యాయి. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఊహించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనాని కట్టడి చేయడంలో విఫలం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాస్కులు తప్పనిసరి చేయకపోగా, లాక్‌డౌన్ విధించడానికి విముఖత చూపించారు. దీంతో ప్రజలు కూడా కరోనా గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో కోవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. బ్రెజిల్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నెమ్మదిగా సాగుతోంది. చైనా తయారీ కరోనావాక్, ఆక్స్‌ఫర్డ్–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లను ఇస్తోంది.