Election Campaign: బ్రహ్మానందం రోడ్ షోకు హ్యూజ్ రెస్పాన్స్.. గెలుపుపై సుధాకర్ ధీమా..

Election Campaign: బ్రహ్మానందం ప్రచారం చేయడంతో సుధాకర్ గెలిచారు..మంత్రి కూడా అయ్యారు.

Update: 2023-05-04 12:51 GMT

Election Campaign: బ్రహ్మానందం రోడ్ షోకు హ్యూజ్ రెస్పాన్స్..గెలుపుపై సుధాకర్ ధీమా..

Election Campaign: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మూడు పార్టీలు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, ఎన్నికల్లో విజయం సాధించి ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్, సత్తా చాటి కింగ్ మేకర్ గా నిలవాలని జేడీఎస్ మూడు పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల వేళ కోట్ల కొద్దీ డబ్బు చేతులు మారుతుండగా మరోవైపు తారలను ప్రచారబరిలో నిలిపి ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు శ్రమిస్తున్నాయి.

తారల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, కిచ్చా సుదీప్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరోయిన్ రమ్య, అలనాటి బాలీవుడ్ అందాల నటి హేమామాలిని ఇలా ఎందరో తారల పేర్లు కన్నడ నాట వినిపిస్తుండగా..మన టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తన మిత్రుడు కోసం కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు.

2019 ఉప ఎన్నికల సందర్భంగా చిక్కబళ్లాపూర్ లో బీజేపీ అభ్యర్థిగా నిలబడిన డాక్టర్ సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు. సుధాకర్ తనకు మిత్రుడు కావడంతో ఎన్నికల ప్రచారానికి వచ్చానంటూ నాడు బ్రహ్మానందం తెలుగు సినిమా డైలాగ్స్ చెబుతూ జనాల్లో ఉత్సాహం నింపారు. బ్రహ్మానందం ప్రచారం చేయడంతో సుధాకర్ గెలిచారు..మంత్రి కూడా అయ్యారు.

మరోసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బ్రహ్మానందం రంగంలోకి దిగారు. తన ఆప్తమిత్రుడు మంత్రి సుధాకర్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. చిక్ బళ్లపూర్ లో జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండడంతో బ్రహ్మానందం ప్రచారం తనకు ఎంతగానో కలిసి వస్తుందని సుధాకర్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరోసారి విజయం ఖాయమని ధీమాగా ఉన్నారు. మరోవైపు బ్రహ్మానందాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. గత ఎన్నికల ప్రచారం మాదిరిగానే బ్రహ్మానందం ఈసారి కూడా మూవీ డైలాగ్స్ తో ఓటర్లలో జోష్ నింపే ప్రయత్నంచేశారు. ఇదిలా ఉంటే, అధికార బీజేపీ పై ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరి, బ్రహ్మానందం ప్రచారం సుధాకర్ ను మరోసారి విజయతీరాలకు చేర్చుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News