Assembly Election: కేరళలో బీజేపీ స్ట్రాటజీ వర్కౌటయ్యే సీనుందా?

Update: 2021-03-10 04:53 GMT

కేరళలో బీజేపీ స్ట్రాటజీ వర్కౌటయ్యే సీనుందా? ( ఫైల్ ఇమేజ్ ) 

Assembly Election: వామపక్షాల కంచుకోట త్రిపురను నాడు బద్దలు కొట్టింది కమలం. ఇప్పుడు మరో రాష్ట్రంలో ఎర్రజెండాను గల్లంతు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. త్రిపుర మంత్రాన్నే కేరళలోనూ ప్రయోగించేందుకు ప్రణాళికను పక్కాగా పట్టాలెక్కిస్తోంది. కేరళలో త్రిపుర అజెండా ఏంటి? వర్కౌట్‌ అవుతుందా? రివర్స్‌ కొడుతుందా?

ఉత్తరాదిలో అడుగుపెట్టిన చోటల్లా, తనదే రాజ్యమవుతున్నా, దక్షిణాదిలో కర్ణాటక తప్ప, మిగతా సౌత్ రాష్ట్రాల్లో కాషాయ ల్యాండింగ్‌కు వీసా దొరకడం లేదు. చొచ్చుకెళ్లాలి, కనీసం పాదమైనా మోపాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నా అంత వీజీ కావడం లేదు. కానీ త్రిపురలో ఎర్రజెండాను కిందికి దించేసిన కాన్ఫిడెన్స్‌ మాత్రం, కమలంలో ఇంకా వుంది. అదే కాన్ఫిడెన్స్‌తో కేరళలోనూ త్రిపుర అజెండాను అప్లై చేసి, ఎర్రజెండాను పక్కకునెట్టెయ్యాలన్న పట్టుదలతో వుంది.

2018లో త్రిపురను హస్తగతం చేసుకుంది బీజేపీ. కేరళ ఒక్కటే వామపక్షాల గుప్పిట్లో ఉంది. త్రిపురలో మాదిరిగానే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి, కేరళలో కూడా వామపక్షాలకు ప్రధాన ప్రత్యర్థి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పక్షంగా అవతరించాలంటే, త్రిపుర స్ట్రాటజీనే కేరళలోనూ అమలు చెయ్యాలని కాస్త సీరియస్‌గా వుంది కాషాయం. త్రిపురలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ నాయకులు, అక్కడి క్రిస్టియన్‌ మతబోధకులు, పెద్దలను దగ్గరికి చేర్చుకున్నారు. క్రిస్టియన్లకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మేరకు, కమలానికి మద్దతుగా నిలిచారు. దాంతో అక్కడ సునాయసంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం కేరళ ఎన్నికల్లో కూడా అదే వ్యూ‍హాన్ని ఫాలో అవ్వాలని డిసైడయ్యింది బీజేపీ.

క్రిస్టియన్లకు దగ్గరయ్యేందుకు ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ. 2020 డిసెంబర్‌, కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, దాదాపు 500 మంది క్రైస్తవ అభ్యర్థులను బరిలో నిలిపింది బీజేపీ. శబరిమల చుట్టుపక్కల భారీగా స్థానాలను కైవసం చేసుకుంది. జనవరి 19న కేరళకు చెందిన క్రిస్టియన్‌ మతపెద్దలతో కూడిన ప్రతినిధి బృందం ప్రధాని మోడీతో భేటి అయ్యింది. ఎల్డీఎఫ్ సర్కారు తమ మైనారిటీ సంక్షేమ పథకాలలో, ముస్లిం సమాజానికి అదనపు ప్రయోజనాలు ఇవ్వడంపై ప్రధానికి వారు ఫిర్యాదు చేశారట. ఇదే మీట్‌లో 'లవ్ జిహాద్' గురించి మాట్లాడారని తెలిసింది. అంతేకాదు, స్థానికంగా ఏ అవకాశం దొరికినా క్రిస్టియన్లను బుట్టలో వేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది కమలం.

కేరళలోని అలప్పుజా జిల్లా చప్పాడ్‌లో అతిపురాతనమైనది, సెయింట్‌ జార్జ్‌ ఆర్థోడాక్స్‌ చర్చి. క్రీస్తు శకం 1050లో నిర్మించారు. జాతీయ రహదారి పక్కనే ఉంది. నేషనల్ హైవే పునర్నిర్మాణంలో భాగంగా ఈ పురాతన చర్చిని కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీనిపై స్థానిక క్రిస్టియన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంలో బీజేపీ నేత బాలశంకర్‌ ఒక్కరే స్పందించి విషయాన్ని ప్రధాని కార్యాలయానికి చేరవేశారు. దాంతో ప్రధాని మోడీ ప్రత్యక్షంగా మధ్యవర్తిత్వం నెరిపి చర్చ్‌ను రక్షించేందుకుగాను ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకి అప్పగించారు. దాంతో ఈ పురాతన చర్చ్‌ను కూల్చివేసే పనులు నిలిచిపోయాయి. దీంతో బీజేపీకి అక్కడ మైలేజీ దక్కింది. అలప్పుజా జిల్లాలోని చెంగనూర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నిలువనున్న బాలశంకర్‌కు ఆర్థోడాక్స్‌ సిరియన్‌ చర్చ్‌ పూర్తిగా సపోర్ట్‌ చేస్తున్నట్టు తెలిపింది.

కేరళలో క్రైస్తవ ఓటర్ల శాతం దాదాపు 20. ముస్లింలు 26-28 శాతం వున్నారని ఒక అంచనా. 1950 నుంచి క్రైస్తవ ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతునిచ్చారు. ముస్లింలు వామపక్షాలకు జై కొట్టారు. అయితే, ఈసారి ఎన్నికల్లో హిందూ ఓటర్లతో పాటు క్రిస్టియన్ ఓటర్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతారని, కమలం పార్టీ నేతల భావన. అదే త్రిపుర సూత్రం. ఇది గనుక వర్కౌటయితే, మాత్రం కేరళలో బీజేపీకి గట్టి బేస్ దొరికినట్టే. ఈ ఎన్నికల్లో అధికారం సాధించేంత బలం దొరక్కపోయినా ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్న కాన్ఫిడెన్స్ వుందట కాషాయ కార్యకర్తల్లో. అయితే, త్రిపుర మంత్రం, మలయాళ సీమలో అంత ఈజీగా వర్కౌట్ కాకపోవచ్చంటున్నారు పరిశీలకులు. చూడాలి, బీజేపీ వ్యూహం పని చేస్తుందో...ఫట్ అంటుందో.

Tags:    

Similar News