వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై రానున్న వారంరోజుల్లో 25 వెబినార్లు నిర్వహించనున్నట్లు బీజేపీవర్గాలు వెల్లడించాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ఎన్నికలను కలిపి నిర్వహించాలని ప్రధాని మోడీ తరచూ ప్రజల ముందు వినిపిస్తున్నారు. ప్రస్తుతం జరిగే విధానం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని చెప్తున్నారు. లోక్‌సభ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్నీ ఒకేసారి జరగాలన్నది కోరుకుంటున్నారు. ఆ మధ్య జరిగిన ఆల్‌ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
ఈ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రణాళికలో భాగంగా వెబినార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్ నాయకులు, నిపుణులు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అటు ఈ మధ్యే జమిలి ఎన్నికలపై సీఈసీ కూడా స్పందించారు. నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఎప్పుడంటే అప్పుడు ఎవర్ రెడీ అన్నట్లుగా ప్రకటన చేశారు. జమిలి ఎన్నికలకు చట్ట సవరణలు చేయాల్సి వస్తుందని అన్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ వరుస వెబినార్‌లకు సిద్ధం అవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.