ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే.. బీజేపీకి ఇబ్బందులు తప్పవా?
Bharatiya Janata Party: బలం లేకపోయినా.. జాతీయ పార్టీగా కాంగ్రెస్ ది పై చేయి...
Bharatiya Janata Party: రాష్ట్రపతి ఎన్నికల కోసం పార్టీల కసరత్తు షురూ అయినట్లేనా? యూపీని గెలిచినా బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికపై పట్టు చిక్కలేదా? దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జెండా ఎగరేస్తున్నా.. ప్రధమ పౌరుడి ఎన్నికలో తడబాటు తప్పదా? ఈ ఎన్నికల్లో కమల దళాన్ని విజయం దోబూచులాడ నుందా? బీజేపీని ఓడించడానికి విపక్షాలన్నీ బేషరతుగా ఒక్కటైతే ఫలితం తారుమారవుతుందా?
మరో రెండు నెలల్లో రాష్ట్రపతి ఎన్నిక ముంచుకొస్తోంది. పార్టీలన్నీ ఈ ఎన్నికపై కసరత్తు మొదలు పెట్టాయి.. యూపీలో తిరిగి అధికారం సంపాదించినా బీజేపీకి రాష్ట్రపతి ఎన్నిక నల్లేరుపై నడక మాత్రం కాబోదు.... ఎందుకంటే గతంలో ఓటమి ఖాయమని తేలినా.. బలం లేకపోయినా విపక్షాలు తమ అభ్యర్ధిగా మీరా కుమార్ ను రంగంలోకి దింపాయి.. ఈసారి మెజారిటీ సాధనకు కొన్ని సీట్లు, ఓట్లు తగ్గడం...ఆ మెజారిటీని ఎన్డీఏలో భాగస్వాములు కాని ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి పొందాల్సి రావడం బీజేపిని ఇబ్బంది పెట్టే అంశాలు...పార్లమెంటులో ఎన్డీఏ ఎలక్టరల్ కాలేజ్ బలం 48 శాతం కాగా ప్రతిపక్షాల బలం 51 శాతంగా ఉంది.
ఈ ఎన్నికలలో గెలవాలంటే ఎన్డీఏకు రెండు శాతం మెజారిటీ తగ్గుతోంది. ఈ రెండు శాతం మెజారిటీ కోసం ఎన్డీఏలో భాగస్వాములు కాని పార్టీల సహాయం తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కానీ దేశంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ సాధనలో ప్రాంతీయ పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్న తరుణంలో ఈ పార్టీల నుంచి సహకారం అంత సులభం కాదు.. మరోవైపు దేశవ్యాప్తంగా డీలా పడినా కాంగ్రెస్ ఇప్పటికీ అతిపెద్ద జాతీయ పార్టీగా తన హవాని కొనసాగిస్తోంది. ప్రాంతీయ పార్టీలైన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు శక్తివంతమైన నేతలుగా ఎదుగుతున్నారు..
పైగా వీరంతా మోడీకి దీటుగా ప్రధాని పదవికి అభ్యర్ధులన్న ప్రచారం జరుగుతోంది.మొన్నటి వరకూ మిత్ర పక్షంగా ఉన్న శివసేన కాషాయ స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టి మహారాష్ట్రలో శక్తివంతమైన ప్రాంతీయ పార్టీగా ఎదిగే పనిలో పడింది. ఇక శరద్ పవార్ లాంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నారు.. అంటే కింగ్ మేకర్ స్థాయినుంచి ఏకంగా కింగే అయిపోవాలని తాపత్రయపడుతున్నారు.. ఇలా ప్రాంతీయ పార్టీలు బలపడుతున్న వేళ రాష్ట్రపతి పదవికి వీరు బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం తక్కువ. అందుకే అందరి దృష్టి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల పైనే పడింది.
దేశ వ్యాప్తంగా 52 సీట్లకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. నిన్నమొన్నటి యూపీ ఎన్నికల్లో బీజేపి అధికారం లోకి వచ్చినా ఆ గెలుపు ఒకటి రెండు రాజ్యసభ సీట్లు పెరగడానికి సాయపడింది.. కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపి బలం పెరిగే అవకాశం పెద్దగా లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ ఎన్నికల్లో సీట్లు పెంచుకోబోతున్నాయి.. అందుకే రాష్ట్రపతి ఎన్నికల సీన్ బీజేపీ వర్సెస్ విపక్షాలు స్థాయి నుంచి బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు గా మారిపోయింది.పార్లమెంటులో ఎన్డీఏ బలం తగ్గితే బీజేపీ ఇతర పార్టీల మద్దతు కోరాల్సి ఉంటుంది..
రాష్ట్రపతి పదవి రబ్బర్ స్టాంపేననే వాదనలున్నా...ఏ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్రపతితో సత్సంబంధాలు కోరుకుంటుంది. కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, తాము అనుకున్నది చేయాలనుకున్నప్పుడు ,కీలక బిల్లుల విషయంలో రాష్ట్రపతి సంతకం తప్పనిసరి.. 2024 ఎన్నికల్లోనూ గెలిచి మూడోసారి అధికార పగ్గాలు అందుకోవాలని తహతహలాడుతున్న బీజేపి అందుకు తగిన విధంగా రోడ్ మ్యాప్ సెట్ చేసుకోవాలి.. అది అనుకూలమైన వ్యక్తి పదవిలో ఉంటేనే సాధ్యపడుతుంది.
రాష్ట్రపతిని కాదని నిర్ణయాలు తీసుకునే అధికారం కేబినెట్ కు ఉన్నా ప్రభుత్వాన్ని తప్పుబట్టి, ఇబ్బందికర స్థితిలోకి నెట్టే శక్తి రాష్ట్రపతికి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ కి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధమే అందుకు నిదర్శనం. అందుకే మోడీ ప్రభుత్వం తమకు అనుకూలుడైన వ్యక్తిని రాష్ట్రపతిగా చూడాలనుకుంటోంది. దీనికోసం అవసరమైతే బీజేడి, టీఆర్ ఎస్, వైసీపీ పార్టీల మద్దతు తీసుకోవాల్సిన అనివార్య స్థితి తలెత్తుతోంది. అయితే టీఆర్ ఎస్ తో ఇప్పటికే ఢీ అంటే ఢీ అంటున్న కమలనాధులు రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేడి, వైసీపీ పార్టీల సహకారం కోరక తప్పదు..ఈ రెండు పార్టీల సహకారం లాంఛనమే అయినా.. విపక్షాలన్నీ కలిస్తే.. రాష్ట్రపతి ఎన్నిక ఫలితం ఒక్క ఓటు తేడాతో అయినా తారుమారయ్యే అవకాశముంది.. ఈ థ్రిల్లింగ్ విక్టరీని పొందే ఐక్యత విపక్షాలలో ఉందా ?