Varun Gandhi: కంగనాపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ ఫైర్.. పిచ్చా? దేశద్రోహమా? అంటూ ట్వీట్
Varun Gandhi - Kangana Ranaut: ఇటీవల ఓ కార్యక్రమంలో కంగనా సంచలన వ్యాఖ్యలు 1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదు.. భిక్ష
Varun Gandhi - Kangana Ranaut: వివాదాస్పద వ్యాఖ్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న సినీ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలనమైన కామెంట్స్ చేసింది. భారత్‌కు అసలైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని.. 1947లో వచ్చింది కేవలం భిక్షం. ఆ విధంగా దొరికినదాన్ని స్వాతంత్ర్యంగా పరిగణిస్తామా? అని కంగనా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటీష్ పాలన, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి.. ఓ కార్యక్రమంలో భాగంగా కంగన ఈ వ్యాఖ్యలు చేశారు. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆమె వ్యాఖ్యలను మద్దతు పలుకుతుండగా, చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలను ఖండించారు. కంగనా వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి.. ఇలాంటి ఆలోచనను పిచ్చితనంగా భావించాలా? లేక దేశ ద్రోహంగానా? అంటూ ధ్వజమెత్తారు. కొన్నిసార్లు మహాత్మాగాంధీ త్యాగాలు, దీక్షకు అవమానం.. మరికొన్నిసార్లు ఆయన హంతకుడికి గౌరవం. ఇప్పుడు ఇలా లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పట్ల తిరస్కార దోరణి. ఈ ఆలోచనను పిచ్చితనంగా పిలవాలా? లేదా దేశ ద్రోహంగానా? అని తీవ్రంగా స్పందించారు వరుణ్ గాంధీ. మరోవైపు కాంగ్రెస్ కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.